Atala Mosque Row: దేశంలో మందిర్-మసీద్ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ షాహీ జామా మసీదు సర్వే అంశం పెద్ద ఎత్తున హింసకు కారణమైంది. ఈ హింసలో ఐదుగురు వ్యక్తులు మరణించడంతో పాటు 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఈ మసీదు ఒకప్పటి హరిహర్ మందరమని, మొఘల్ పాలకుడు బాబర్ కూల్చివేసి మసీదుగా మార్చారని హిందూ పక్షం కోర్టును ఆశ్రయించడంతో సర్వేకి ఆదేశాలు ఇచ్చింది.
ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని మరో మసీదు కూడా వివాదస్పదమైంది. జౌన్‌పూర్‌లోని ‘‘ అటాటా మసీదు’’ అంశం న్యాయస్థానంలో ఉంది. ఈ మసీదు హిందూ ఆలయమని కన్నౌజ్ రాజు విజయ్ చంద్ర ‘‘అటలా దేవి ఆలయం’’ నిర్మించారని హిందూ పక్షం చెబుతోంది. 14వ శతాబ్ధంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడని, దీంతో అక్కడ పూజలు నిలిపేశారని స్వరాజ్ వాహిని అసోసియేషన్ జౌన్‌పూర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో డిసెంబర్ 16 విచారణ జరగనుంది. మసీదు సర్వేపై కీలక ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.
సివిల్ కోర్ట్ జూలై 2న ఈ పిటిషన్‌ని స్వీకరించి సర్వేకి ఆదేశించింది. జూలై 30న సర్వే చేసేందుకు వెళ్లిన సమయంలో భారీ సంఖ్యలో జనం రావడంతో సర్వే పూర్తి కాలేదు. దీంతో అదనపు భద్రత బలగాలను అందుబాటులో ఉంచాలని సర్వే టీం కోర్టుని కోరింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సర్వే చేయాలని హిందూ పక్షం అభ్యర్థించగా.. సర్వే ఫార్మాట్‌ని డిసెంబర్ 16న ఖరారు చేయనున్నారు.
హిందూ పక్షం వాదన ఇదే:
స్వరాజ్ వాహిని అసోసియేషన్, సంతోష్ కుమార్ మిశ్రా జౌన్‌పూర్ సివిల్ కోర్టులో దావా వేశారు. ఈ మసీదు ఒకప్పటి దేవీ ఆలయమని చెప్పారు. సనాతనధర్మాన్ని ఆచరించేవారికి పూజించే హక్కు ఉందని చెప్పారు. దీనిని 13 శతాబ్ధంలో రాజా విజయ్ చంద్రచే ఈ ఆలయం నిర్మించబడిందని పేర్కొన్నారు. 13వ శతాబ్ధంలో ఫిరోజ్ షా తుగ్లక్ భారతదేశంపై దండయాత్ర చేసి, గుడిని కూల్చేసి దాని గోడలపై మసీదు నిర్మించినట్లు చెప్పారు. హిందూ పక్షం వాదనల్ని ముస్లిం పక్షం ఖండించింది. ఏ ఆలయంపై మసీదు నిర్మించబడలేదని చెప్పింది. ఈ మసీదుని 1398లో నిర్మించారని, అప్పటి నుంచి నిరంతరం ఉపయోగంలో ఉందని, శుక్రవారం ముస్లిం సమాజం క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తోందని చెప్పారు.