Cross-border marriage: ఇటీవల కాలంలో సరిహద్దు దాటి ప్రేమలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్‌కి చెందిన పలువురు యువతీయువకులు ప్రేమించుకున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ యువతి, పబ్జీ ద్వారా పరిచయమైన లవర్ సచిన్ కోసం భారత్ వచ్చిన వార్త సంచలనంగా మారింది. తాజాగా భారత్‌కి చెందిన ఓ యువతి, పాకిస్తాన్ వ్యక్తిని ప్రేమించింది.
కాగా, సదరు అమ్మాయి, పాక్ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఇస్లాంని స్వీకరించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన జస్ప్రీత్ కౌర్ ఇస్లాం మతంలోకి మారి పాకిస్తాన్ సియాల్‌కోట్‌కి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంది. లూధియానా నివాసి జస్ప్రీత్ కౌర్ పెళ్లికి ముందు తన పేరును జైనబ్‌గా మార్చుకుంది. జామియా హనాఫియా సియాల్ కోట్ జారీ చేసిన సర్టిఫికేట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నివేదిక ప్రకారం.. జస్ప్రీత్, అర్సలాన్‌ల మధ్య జనవరి 16న పాకిస్తాన్లో తొలిసమావేశం జరిగింది. మతపరమైన యాత్ర కోసం ఆమె ఏప్రిల్ 15 వరకు ఆమెకు వీసా లభించింది. మ్యూనిచ్ నుంచి ఆమెకు ఇండియన్ పాస్‌పోర్టుపై వీసా లభించింది. జస్ప్రీత్ మరియు ఆమె తల్లిదండ్రులు భారతీయులేనని, అయితే వారు జర్మనీలో నివసిస్తున్నారని జామియా హనీఫియా సియాల్‌కోట్ అధికారులు తెలిపారు.
Read Also: Ukraine War: రష్యా తరుపున యుద్ధంలో భారతీయులు.. కేంద్రం కీలక సూచనలు..
పాక్ అధికారుల ప్రకారం.. జామియా హనాఫియాలో ఇస్లాం మతంలోకి మారిన రెండు వేల మందికి పైగా ముస్లిమేతరులలో జస్ప్రీత్ కౌర్ ఒకరు. జస్ప్రీత్, అర్సలాన్ ముందుగా విదేశాల్లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను అర్సలాన్ పాకిస్తాన్ ఆహ్వానించాడు. ఆ తర్వాత జస్ప్రీత్ మతపరమైన యాత్ర కోసం పాక్ వీసా అఫ్లై చేసుకుంది. జనవరి 16న ఆమె పాకిస్తాన్ చేరుకుంది, ఆ తర్వాత ఇస్లాం స్వీకరించి వివాహం చేసుకుంది.
ఇటీవల కాలంలో సీమా హైదర్ మాత్రమే కాకుండా.. జోధ్‌పూర్ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అమీనా అనే అమ్మాయి భారత్ వచ్చింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు అంజూ థామన్ అనే వివాహిత భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లింది. ఆమెకు అప్పటికే పెళ్లై భర్త, పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత అంజూ క్రిస్టియన్ నుంచి ఇస్లాం మతంలోకి మారి ఫాతిమా అనే పేరు మార్చుకుంది.
