NTV Telugu Site icon

Jammu Kashmir: పాక్ సరిహద్దులను జల్లెడపడుతున్న భద్రతాబలగాలు

Kashmir Loc

Kashmir Loc

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ ఎత్తేసిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి. ఎప్పటికప్పుడు లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నా… భద్రతా బలగాలు వరసగా ఎన్ కౌంటర్లు చేసి ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి. సరిహద్దుల వెంబడి పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గింది. భద్రతా బలగాలు సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతో చాలా వరకు చొరబాట్లు తగ్గాయి. పోలీసులు, ఆర్మీ చేస్తున్న జాయింట్ ఆపరేషన్లలో పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు మరణించారు.

ఇదిలా ఉంటే తాజాగా పాక్ – ఇండియా సరిహద్దులను జల్లెడ పడుతున్నాయి పోలీసులు, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు సాంబా ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేశాయి. అయితే ఇటీవల సాంబా ప్రాంతంలోని కొంతమంది స్థానికులు అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో భద్రతా బలగాలు అలెర్ట్ అయ్యారు. నలుగురు వ్యక్తులు బ్యాగులు ధరించడాన్ని చూశామని స్థానికులు  చెబుతున్నారు. దీంతోనే పెద్ద ఎత్తున ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన పక్కా సమాచారంతోనే తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి తోడు ఇటీవల సాంబా ప్రాంతంలోని సరిహద్దు వెంబడి ఒక సొరంగాన్ని భద్రతా బలగాలు కనుక్కున్నాయి. ఈ పరిణామాల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. భద్రతా బలగాలు మాత్రం సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు చేపడుతున్నామని… సరిహద్దులకు దగ్గర నేషనల్ హైవే ఉండటంతో పాటు ఇటీవల సొరంగం బయటపడటం వంటి కారణాలతోనే తనికీ చేస్తున్నామని డిప్యూటీ ఎస్పీ భరద్వాజ్ వెల్లడించారు.