Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్‌లో ఇద్దరు స్పెషల్ పోలీస్ అధికారులు(SPO)లను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం తీవ్రంగా వేట కొనసాగిస్తున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ జహంగీర్ సరూరితో సహా ముగ్గురు వాంటెడ్ టెర్రరిస్టుల పోస్లర్లను విడుదల చేశారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి, వీరిని పట్టుకోవడానికి దారితీసే సమాచారం అందించిన వారికి రూ. 30 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఇద్దరు పోలీస్ అధికారుల హత్య తర్వాత భద్రతా బలగాలు దచ్ఛన్ ప్రాంతంలో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశాయి.
పోలీసులు విడుదల చేసిన పోస్టర్లలో జహంగీర్ సరూరి, రియాజ్ అహ్మద్ అలియాస్ హజారీ, ముదస్సిర్ హుస్సేన్ పేర్లు ఉన్నాయి. వీరంతా ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాల్లో యాక్టివ్‌గా ఉన్నారని పోలీసులు తెలిపారు. జహంగీర్ సరూరి 1990వ దశకం నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇతడిని A++ కేటగిరీ ఉగ్రవాదిగా భద్రతా బలగాలు వర్గీకరించాయి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటూ దశాబ్దాలుగా భద్రతా బలగాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు సమాచారం. కిష్త్వార్, దోడా జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో ఉన్న తన ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు, స్థానిక మద్దతుదారుల నెట్వర్క్ సహాయంతో ఇతడు ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇద్దరు SPOల దారుణహత్య..
కిష్త్వార్‌లోని మారుమూల దచ్ఛన్ ప్రాంతంలో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు బాబీ చంద్, రష్పాల్ కుమార్ హత్యకు గురయ్యారు. వీరిద్దరు సైనిక పోస్ట్‌కు వెళ్తున్న సమయంలో అదృశ్యమయ్యారు. గురువారం దట్టమైన అడవుల్లో వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. బుల్లెట్లతో వీరిద్దరి శరీరాలు ఛిద్రమైన స్థితిలో కనిపించాయి. వీరి సర్వీస్ రివాల్వర్లు కూడా కనిపించలేదు.

