Site icon NTV Telugu

Ministry of Home Affairs: జమ్మూకాశ్మీర్ గజ్నవీ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌పై కేంద్రం నిషేధం..

Jammu Kashmir

Jammu Kashmir

JKGF Banned In India: భారత దేశానికి, భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడుతున్న ఉగ్రసంస్థలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకర్తలతో ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్ గజ్నవీ ఫోర్స్ (జేకేజీఎఫ్)పై శుక్రవారం ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. దీంతో పాటు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)ను కూడా నిషేధించింది. ఈ రెండింటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి ఈ నిషేధం విధించింది కేంద్రం. దీంతో పాటు పంజాబ్ కు చెందిన హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

Read Also: Kriti Kharbanda: కృతి.. నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ తోనే సెటిల్ అవుతున్నావా..?

జేకేజీఎఫ్ దేశంలోకి చొరబాట్లు, మాదకద్రవ్యాల, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాద దాడులు, భద్రతా బలగాల బెదిరింపులకు పాల్పడుతోందని నోటిఫికేషన్ లో కేంద్ర పేర్కొంది. జకేజీఎఫ్ తన ఉగ్రవాదులను లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్, హర్కత్-ఉల్-జెహాద్-ఇ-ఇస్లామీ, ఇతర నిషేధిత ఉగ్రవాద సంస్థల నుంచి రిక్రూట్ చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలను భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు జేకేజీఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

సంధు అలియాస్ రిండా, పాకిస్తాన్ లాహోర్ లోని నిషేధిత ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపింది. 2021లో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్‌పై జరిగిన దాడి వెనుక సూత్రధారులలో సంధు ఒకడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతను పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్, కాంట్రాక్ట్ హత్యలు, దోపిడీ వంటి అనేక నేరాల్లో పాల్గొన్నట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన 54 వ్యక్తి రిండా. గత నెలలో కేంద్రం లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన రెండు ప్రాక్సీ ఉగ్రసంస్థలను నిషేధించింది. నలుగురు వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించింది.

Exit mobile version