NTV Telugu Site icon

Jamili election: జమిలి ఎన్నికలు.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ!

Ram Nath Kovind

Ram Nath Kovind

Jamili election: దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఇటు అధికార పక్షమైన బీజేపీ తన ఎన్‌డీయే పక్షాలతోపాటు.. తన సొంత సొంత బలం పెంచుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఈ సారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో దేశంలోని 28 పార్టీలు ఏకమై ఇండియా కూటమీగా ఏర్పడి ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం మూడో సమావేశం ముంబైలో నిన్న ప్రారంభం కాగా.. నేడు కూడా కొనసాగనుంది. దేశంలో ఎన్నికలు వచ్చే ఏడాది మే, జూన్‌లో జరిగాల్సి ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది జరగాల్సి న ఎన్నికలు కాస్త ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న కేంద్రం ప్రకటించిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ప్రకటన.. ఈ రోజు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం చూస్తుంటే.. ముందస్తు తథ్యంగానే కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికల గురించి చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం ఏకంగా ఒక దేశం- ఒకే ఎన్నిక పేరుతో దేశంలో ఒకేసారి పార్లమెంట్‌ సభ్యుల ఎంపికతోపాటు.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించాలనే యోచన కోసం కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో 16 మందితో కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కమిటీ జమిలి ఎన్నికల సాధ్యాసాద్యాలను పరిశీలించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. అన్ని అంశాలను అధ్యయనం చేసి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులను చేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలో జమిలి ఎన్నికల కోసం గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికల’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. సెప్టెంబరులో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటన వెలువడటం.. మరుసటి రోజే జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

Read Also: Vivek Ramaswamy: నేను యూఎస్ ప్రెసిడెంట్ అయితే.. రష్యాకు రామస్వామి బిగ్ ఆఫర్

దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఆలోచనను మోడీ సర్కారు గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు దీన్ని అమల్లోకి తెచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను మాజీ రాష్ట్రపతి కోవింద్‌కు అప్పగించినట్లు తాజాగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే జమిలి దిశగా ఎన్నికలకు వెళ్లాలంటే.. పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించడానికి రాజ్యాంగంలో కనీసం అయిదు అధికరణలను సవరించాలని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ రాజ్యసభలో వెల్లడించారు. ఆ సవరణల కోసమే ప్రత్యేక సమావేశాల్లో బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది చివర్లో నవంబరు-డిసెంబరు మధ్య ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం.. వచ్చే ఏడాది మే-జూన్‌ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలతో కేంద్రం లోక్‌సభను రద్దు చేసి ముందస్తుగానే జమిలి ఎన్నికలకు వెళ్లొచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జమిలి ఎన్నికలను చాలా పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. కొన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి. పలుసార్లు ఎన్నికలు జరిగితే ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని.. ఒకేసారి జరిగితే ఆ భారం కాస్త తగ్గుతుందని అధికార పార్టీ చెబుతోంది.