NTV Telugu Site icon

Haryana Elections: అధికారాన్ని దూరం చేసిన రాహుల్ ‘జిలేబీ’ వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్!

Rahulgandhi

Rahulgandhi

హర్యానాలో ఈసారి హస్తం పార్టీదే అధికారమని.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సర్వేలన్నీ ఊదరగొట్టాయి. రెండు రోజులు గడిచే సరికి అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్‌లో ఏ ఒక్కటి నిజం కాలేదు. తిరిగి హర్యానా ప్రజలు కమలం పార్టీనే కోరుకున్నారు. హస్తం పార్టీని తిరిగి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా జిలేబీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాహుల్ గాంధీ హర్యానాలోని గోహనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్‌ నాయకుడు దీపేందర్‌ సింగ్‌ హూడా.. రాహుల్‌కు జిలేబీ తినిపించారు. జిలేబీ రుచి చూశాక రాహుల్ ఒక్కసారిగా మైమరిచారు. అద్భుతం అంటూ గొప్పగా పొగిడారు. తన జీవితంలో ఇంత అద్భుతమైన.. రుచికరమైన జిలేబీని ఎప్పుడూ తినలేదని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పబ్లిక్ మీటింగ్‌లో దీని గురించి ప్రసంగం చేశారు. తాను కారులో వస్తూ హర్యానా జిలేబీ రుచి చూశానని.. తన సోదరికి కూడా ఒక బాక్స్ తీసుకొస్తానని మెసేజ్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇదే అంశాన్ని మరింత సాగదీస్తూ.. ఇలాంటి జిలేబీలను ఫ్యాక్టరీల్లో తయారు చేసి దేశంలోనే ప్రతి ప్రాంతానికి వెళ్లాలని.. అంతేకాకుండా జపాన్, అమెరికాతో పాటు అన్ని దేశాలకు ఎగుమతి చేయాలని.. దీని ద్వారా అనేక మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. అనంతరం మోడీని టార్గెట్ చేస్తూ.. అదానీ, అంబానీలకు దేశాన్ని దోచుపెడుతున్నారని.. అదే జిలేబీ తయారు చేసే సంస్థలను ప్రోత్సహిస్తే.. ఎంతో మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇలా జిలేబీ అంశం సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ జిలేబీ వ్యాఖ్యలను బీజేపీ విపరీతంగా ట్రోలింగ్ చేసింది. జిలేబీ ఫ్యాక్టరీలంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసింది. తాజాగా ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ అంతా రివర్స్ అయిపోయింది. ఫలితాలు తారుమారు అయిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించిన వాళ్లంతా ఇప్పుడు జిలేబీ వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్ వ్యాఖ్యలు కొంపముంచాయంటూ కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుతున్నారు. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపే చూసినట్లుగా తాజా ఫలితాలను బట్టి అర్థమవుతోంది. అంతే కాకుండా కుల గణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా సత్‌ఫలితాలు ఇవ్వలేదు. మొత్తానికి రాహుల్‌కి తీపి వార్త కాస్త.. చేదువార్త అయిందని బీజేపీ ట్రెండింగ్ చేస్తోంది.