Site icon NTV Telugu

Khaleda Zia: ఖలీదా జియా అంత్యక్రియల కోసం ఢాకాకు జైశంకర్..

Jaishankar , Khaleda Zia

Jaishankar , Khaleda Zia

Khaleda Zia: భారత్, బంగ్లాదేశ్ మధ్య దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా అనారోగ్య సమస్యలతో ఈ రోజు(సోమవారం) మరణించారు. అయితే, ఖలీదా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. డిసెంబర్ 31న జరిగే ఖలితా అంత్యక్రియల కోసం జైశంకర్ ఢాకాకు వెళ్లనున్నారు. ఖలీదా జియా కుమారుడు, బీఎన్‌పీ యాక్టింగ్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్న తారిక్ రెహమాన్ 17 ఏళ్ల ప్రవాసం తర్వాత, ఇటీవల బంగ్లాదేశ్‌కు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఖలీదా మరణించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బంగ్లా ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు.

Read Also: Assam: అస్సాంలో బంగ్లాదేశ్‌ ఉగ్ర మాడ్యుల్ భగ్నం.. 11 మంది అరెస్ట్..

గతేడాది విద్యార్థుల హింసాత్మక తిరుగుబాటు తర్వాత, మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి. బంగ్లాలోని రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మైనారిటీ హిందువులపై ఆ దేశంలో మతోన్మాదులు దాడులు చేసి, హత్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా మారాయి. ఈ నేపథ్యంలో జైశంకర్ పర్యటన కీలకం కాబోతోంది.

అయితే, ఖలీదా జియా రెండుసార్లు తన పదవీకాలంలో భారత్ కన్నా పాక్, చైనాలతో బంగ్లాదేశ్ సంబంధాలను బలపరిచారు. ఈమెకు భారత వ్యతిరేకిగా పేరుంది. ప్రస్తుత, యూనస్ ప్రభుత్వం పాక్, చైనాలతో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో, భారత్ బీఎన్పీకి దగ్గర అవుతోంది. బంగ్లాదేశ్‌లో జరగబోయే ఎన్నికలలో ప్రధాన పోటీదారుగా ఉన్న జియా కుమారుడు రెహమాన్, ఢాకాకు తిరిగి రాకముందే ఇప్పటివరకు సరైన సంకేతాలు ఇచ్చారు. ఆయన ఢాకాలో జరిగిన ఒక ర్యాలీలో, బంగ్లాదేశ్ భారతదేశంతో గానీ, పాకిస్తాన్‌తో గానీ సన్నిహిత సంబంధాలు పెట్టుకోదని ఆయన స్పష్టం చేశారు. తమకు బంగ్లాదేశ్ ముఖ్యమని చెప్పారు.

Exit mobile version