India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదాన్ని పెంచింది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఉప్పునిప్పుగా ఉన్నాయి. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన చర్యల ద్వారా ఇండియాను మరింతగా రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా-కెనడా విదేశాంగ మంత్రుల మధ్య అమెరికా వేదికగా రహస్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మధ్య రెండు రోజుల క్రితం వాషింగ్టన్ లో రహస్య సమావేశం నిర్వహించారు. అయితే రెండు దేశాలు ఇప్పటి వరకు ఈ సమావేశాన్ని ధృవీకరించలేదు. కెనడా దౌత్యవేత్తలు పలువురిని ఇండియా వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో, వారి దౌత్యపరమైన రక్షణలు తొలగించే ప్రమాదం ఉన్న సమయంలో భారతదేశంతో దౌత్య పరిస్థితిని పరిష్కరించడానికి కెనడా ప్రయత్నిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
Read Also:Eggs storing : ఎక్కువ రోజులు గుడ్లు ఫ్రెష్ గా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
ఇటీవల దౌత్య ఉద్రిక్తతలపై ఇండియాతో ప్రైవేటుగా మాట్లాడుకుంటామని కెనడా ప్రకటించిన తరుణంలో ఈ సమావేశానికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా భారతదేశంతో ఉద్రిక్తతలను పెంచుకోవడం తమ ఉద్దేశం కాదని వెల్లడించారు. ఇదిలా ఉంటే ట్రూడో మాటలకు చేతలకు సంబధం ఉండటం లేదు. ఇటీవల యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజుతో భారత దేశ అంశాన్ని చర్చించాడు. దీనిపై ఇండియా తీవ్రం ఆగ్రహంతో ఉంది.
ఈ ఏడాది జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించడం ఒక్కసారిగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. అయితే కెనడా ఆరోపణల్ని భారత్ అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలుస్తోందని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
