దాదాపు 40 ఏళ్ల తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌కు భారీ షాక్ తగిలింది. ఆయనపై హత్య కేసు నమోదుకు న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి పుల్ బంగాష్ గురుద్వారాలో ముగ్గురు సిక్కులను కాల్చి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై హత్య, ఇతర నేరాలపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియాల్ ఆదేశాలు జారీ చేశారు. ఆయనపై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: MK Meena: ఉచిత ఇసుక అమలులో జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షించండి..
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి గతంలో ఓ ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. 1984 నవంబరు 1న టైట్లర్ తెలుపు అంబాసిడర్ కారులో నుంచి దిగి అల్లరిమూకలను రెచ్చగొట్టినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మన తల్లిని చంపేసిన వారిని చంపేయండి అంటూ అక్కడ ఉన్న వారిని ప్రేరేపించారని సదరు సాక్షి పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. టైట్లర్‌పై చట్టవిరుద్ధంగా గుమిగూడడం, అల్లర్లు ప్రేరేపించడం, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, లూటీ, దురాక్రమణ వంటి అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 13న తదుపరి విచారణను చేపట్టనుంది.
ఇది కూడా చదవండి: Hair fall: వానాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి