NTV Telugu Site icon

XPoSat: న్యూ ఇయర్ రోజే ఇస్రో ‘‘ఎక్స్‌పోశాట్’’ ప్రయోగం.. మిషన్ లక్ష్యాలు ఇవే..

Pslv

Pslv

XPoSat: 2023లో చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 మిషన్ల ద్వారా ఇస్రో ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2024 తొలిరోజే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు(జనవరి1)న పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ద్వారా ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ (XPoSat)ని ప్రయోగించనుంది. ఇది పీఎస్ఎల్వీవీకి 60వ మిషన్. ఎక్స్‌పోశాట్‌ని పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు ఉదయం 9.10కి ప్రయోగించనున్నారు.

విశ్వంలోని సుదూరాల నుంచి వచ్చే కాస్మిక్ ఎక్స్-తరంగాల ధ్రువణాలను అధ్యయనం చేయడానికి భారత్ తొలిసారిగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఇది అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్‌ని అధ్యయనం చేస్తుంది. విశ్వంలో ఉన్న సమస్యాత్మక రహస్యాలను ఈ ప్రయోగం ద్వారా వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.

Read Also: QR code scam: రామమందిరం పేరిట భక్తుల్ని లూటీ చేస్తున్న “క్యూఆర్ కోడ్ స్కామ్”.. వీహెచ్‌పీ వార్నింగ్..

అంతరిక్ష నౌక రెండు సైంటిఫిక్ పేలోడ్లను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి తీసుకెళ్తుంది. ప్రైమరీ పేలోడ్ POLIX (X-కిరణాల పోలారిమీటర్ పరికరం) ద్వారా ఖగోళంలోని 8-30 keV ఫోటాన్ల మీడియం ఎక్స్-రే పరిధిలోని పోలరైజేషన్ స్థాయి, కోణాన్ని కొలుస్తుంది. XSPECT (X-రే స్పెక్ట్రోస్కోపీ మరియు టైమింగ్) పేలోడ్ 0.8-15 keV శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందిస్తుంది. కాస్మిక్ సోర్సెస్ నుంచి వెలువడే ఎక్స్-రే పోలరైజేషన్, లాంగ్ టర్మ్ స్పెక్ట్రమ్‌పై అధ్యయనాలు చేయడంతో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పంపిణీ, గెలాక్సీ కాస్మిక్ ఎక్స్-రే సోర్సెస్ లోని యాక్సిలరేటర్ల స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు ఎక్స్‌పోశాట్ ప్రయోగం ఉపయోగపడనుంది.