NTV Telugu Site icon

Israel: ఇరాన్ దాడి చేస్తుందనే, గాజా నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ..

Israel

Israel

Israel: గాజా దక్షిణ ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తన దళాలను ఉపసంహరించుకుంది. ఖాన్ యూనిస్ నగరం నుంచి ఇజ్రాయిల్ కొంత మంది సైనికులను బయటకు తీసుకువస్తున్నట్లు మిలిటరీ అధికారులు ఆదివారం తెలిపారు. రఫా బార్డర్ వద్ద మెరుగైన మానవతా కార్యక్రమాల కోసం ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయిల్ తెలుపుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ మధ్య ప్రారంభమైన గాజా యుద్ధం ప్రస్తుతం 7వ నెలకు చేరుకుంది. మరోవైపు సంధి వైపు చర్చలు జరుగుతున్నాయి.

అంతకు ముందు గాజా దక్షిణ భాగంలో ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై తాము దాడి చేస్తామని గత కొన్ని వారాలుగా ఇజ్రాయిల్ చెబుతూ వస్తోంది. అయితే, ఆ ప్రాంతంలో మిలియన్ మంది జనాభా ఉండటంతో అమెరికా, ఇతర దేశాలు ఈ చర్యల్ని సమీక్షించాలని ఇజ్రాయిల్‌ని కోరాయి. తీరా ఆ ప్రాంతం నుంచే బలగాల ఉపసంహరణ జరిగింది.

Read Also: KL Rahul: 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుంది: కేఎల్ రాహుల్

ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ పాక్షిక ఉపసంహరణ ఇరాన్ దాడి చేస్తుందనే అనుమానాల నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల సిరియా డమాస్కస్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ ఎంబసీ లక్ష్యంగా జరిపిన దాడిలో ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరణించారు. ఇరాన్ అత్యున్నత మిలిటరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది.

ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ తన బలగాలను గాజా నుంచి ఉపసంహరించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రంజాన్ తర్వాత ఎప్పుడైనా ఇరాన్ దాడి చేయవచ్చని ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బాంబ్ షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు, జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థకు అంతరాయాన్ని సృష్టిస్తోంది. ఇలా చేయడం వల్ల గైడెడ్ మిస్సైల్స్, డ్రోన్ల దాడిని అరికట్టవచ్చని ఇజ్రాయిల్ భావిస్తోంది.

Show comments