Site icon NTV Telugu

ISIS Plan To Attack In India: ఆత్మాహుతి దాడికి ఐసిస్ ప్లాన్.. టెర్రరిస్టును అరెస్ట్ చేసిన రష్యా

Isis Plan To Attack In India

Isis Plan To Attack In India

ISIS Plan To Attack In India: భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కుట్ర చేసింది. అధికార పార్టీలో కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధం అయింది. అయితే ఈ ప్లాన్ ను భగ్నం చేసింది రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ). ఇండియాలో ఆత్మాహుతి ఉగ్రదాడి చేసేందుకు ఐసిస్ కుట్రను ముందుగానే పసిగట్టింది రష్యా. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రష్యా అధికారులు. ఈ విషయాన్ని సోమవారం రష్యా వార్త సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది.

రష్యా భద్రతా ఏజెన్సీ ఎఫ్ఎస్బీ నిషేధిత ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించిందని.. అతడిని అరెస్ట్ చేసిందని స్పుత్నిక్ వెల్లడించింది. మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఇందుకోసం రిక్రూట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భారత్ లో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తిని ఆత్మాహుతి దాడి ద్వారా హతమార్చాలని ప్లాన్ వేసినట్లుగా కుట్ర కోణం బయటకు వచ్చింది.

Read Also: MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు.. దర్యాప్తుకు సహకరిస్తా..

అదుపులోకి తీసుకున్న వ్యక్తిని టర్కీ ఇస్తాంబుల్ వేదికగా ఐసిస్ రిక్రూట్ చేసుకున్నట్లుగా తెలిసింది. అయితే ఉగ్రవాది రష్యా మీదుగా ఇండియాకు వెళ్తే అనుమానం రాదనే ఉద్దేశంతో డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్న తరుణంలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు ఈ కుట్రను భగ్నం చేశారు. ఐసిస్ ఉగ్రసంస్థను భారత్ నిషేధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాాలు చట్టం 1967 కింద ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ఐసిస్ తన భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగిస్తోంది. గతంలో ఐఎస్ఐఎస్ కు ఆకర్షితమైన కొంతమంది సిరియా వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మరికొంత మందిని అరెస్టు కూడా చేశారు.

Exit mobile version