IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!

  • రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
  • ఇక వేగంగా తత్కాల్!
  • త్వరలో కొత్త వైట్‌సైట్
Train

Train

భారతీయ రైల్వే వ్యవస్త కొత్త రూపం మార్చుకోబోతుంది. టికెట్ బుకింగ్‌లో ఎదురయ్యే కష్టాలకు ఇక ఫుల్‌స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ ప్రయాణాల సమయంలో తత్కాల్ బుకింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఇబ్బందులకు రైల్వే శాఖ ముగింపు పలకబోతుంది.

ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన సేవలు అందించేందుకు ఐఆర్‌సీటీసీ కొత్త టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను తీసుకురాబోతుంది. ఈ కొత్త పోర్టల్ జూలై 15న ప్రారంభమవుతుందని తొలుత సమాచారం వచ్చినప్పటికీ.. కొన్ని నివేదికల ప్రకారం ఆగస్టు రెండో వారంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

ఏం కొత్తగా ఉంటుంది?

కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రయాణికులకు మరింత సరళమైన, ఆకర్షణీయమైన ఇంటర్‌ఫేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం బుకింగ్ సమయంలో కనిపించే అనవసర పాప్‌అప్‌లు, ప్రకటనలు, పదేపదే వచ్చే క్యాప్చా (CAPTCHA) ధృవీకరణలు గణనీయంగా తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో ప్రతి సెకన్ కీలకమైనందున ఈ మార్పులు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. అలాగే టికెట్ బుక్ చేసే సమయంలో ప్రయాణికులు తమకు నచ్చిన సీటు లేదా బెర్త్‌ను స్వయంగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటివరకు వ్యవస్థ కేటాయించిన సీటును మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది.

ఒకే స్క్రీన్‌లో

కొత్త వెబ్‌సైట్‌లో ఫేర్ క్యాలెండర్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా వేర్వేరు తేదీల్లో టికెట్ ధరలను ముందుగానే పోల్చుకుని తక్కువ ధర ఉన్న రోజును ఎంపిక చేసుకునే వీలు ఉంటుంది. అదే విధంగా స్లీపర్, ఏసీ-3, ఏసీ-2 తదితర అన్ని క్లాసుల సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌లో చూసే సౌకర్యం కల్పించనున్నారు. ప్రస్తుతం ప్రతి క్లాస్‌ను విడివిడిగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రయాణికులు సులభంగా ఉపయోగించుకునేలా కొత్త వెబ్‌సైట్‌లో పలు భారతీయ భాషలకు మద్దతు ఇవ్వనున్నారు. అలాగే దివ్యాంగులు, విద్యార్థులు, రోగుల కోసం ఉన్న రాయితీ టికెట్ బుకింగ్ సేవలను కూడా ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నారు.

కొత్త వెబ్‌సైట్‌లో అత్యంత కీలకమైన మార్పు సాంకేతిక సామర్థ్యాల్లో ఉండనుంది. ప్రస్తుతం తత్కాల్ బుకింగ్ సమయంలో లక్షలాది మంది ఒకేసారి లాగిన్ అవ్వడంతో సర్వర్‌పై భారీ ఒత్తిడి ఏర్పడి వెబ్‌సైట్ స్లో అవడం, చెల్లింపులు నిలిచిపోవడం, టికెట్లు ఫెయిల్ కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్త వ్యవస్థ ద్వారా నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్‌ను నిర్వహించే సామర్థ్యం ఉండనుంది. ప్రస్తుతం ఈ సామర్థ్యం సుమారు 32 వేల టికెట్ల వరకు మాత్రమే ఉంది. అదేవిధంగా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) నిమిషానికి 40 లక్షల విచారణలను నిర్వహించగలిగేలా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సామర్థ్యం సుమారు 4 లక్షల విచారణల వరకు మాత్రమే ఉంది. దీంతో తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్‌సైట్ క్రాష్ అవడం, చెల్లింపులు విఫలం కావడం, టికెట్ కన్ఫర్మ్ కాకపోవడం వంటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.