NTV Telugu Site icon

IRCTC: అండమాన్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్ గురించి తెలుసుకోండి

Andaman Tour

Andaman Tour

IRCTC:  దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరుపతి, షిర్డీ, పూరీ వంటి పుణ్యక్షేత్రాలతో పాటు అండమాన్ దీవులు వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటించింది. అందమైన దీవులు చూడాలని భావించేవారికి అండమాన్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 5 రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీతో ఇది ఉంటుందని వివరించింది. హేవ్ లాక్, పోర్టు బ్లెయిర్ వంటి వివిధ ప్రాంతాలు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. జనవరి 28 నుంచి అండమాన్ టూర్ ప్యాకేజీని టూరిస్టులు పొందవచ్చు. విమాన ప్రయాణంతో పాటు ఛార్జీలు కలిపి ఉండనున్నాయి.

తొలిరోజు విశాఖ నుంచి ఉదయం 8:40 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:50 గంటలకు పోర్టుబ్లెయిర్ చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం సెల్యులార్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్ సందర్శిస్తారు. తర్వాత సెల్యులార్ జైలులో లైట్, సౌండ్ షో చూడొచ్చు. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది. రెండో రోజు హోటల్‌లోనే అల్పాహారం చేసి రాస్ ఐలాండ్ బయలుదేరుతారు. అనంతరం నార్త్ బే సందర్శన ఉంటుంది. అక్కడ లంచ్ చేసిన తర్వాత నేవల్ మెరైన్ మ్యూజియానికి తీసుకువెళ్తారు. రెండో రోజు కూడా పోర్టు బ్లెయిర్‌లోనే బస ఉంటారు. మూడో రోజు ఉదయం హోటల్‌లోనే అల్పాహారం చేసి చెక్ అవుట్ అవుతారు. అనంతరం హావ్‌లాక్ ద్వీపానికి తీసుకెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. తర్వాత ఎలిఫెంట్ బీచ్‌కి వెళ్లి వాటర్ స్పోర్ట్ ఎంజాయ్ చేయవచ్చు. సాయంత్రం రాధానగర్ బీచ్ సందర్శన ఉంటుంది. రాత్రికి హోటల్‌లో బస చేస్తారు.

Read Also: Bobby: ప్రతి సీన్ లో ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్ ఉంటుంది

నాలుగోరోజు హావ్‌లాక్ ద్వీపంలోని హోటల్‌లో అల్పాహారం చేసి చెక్ అవుట్ అవ్వాలి. అనంతరం కాలాపత్తర్ బీచ్‌కు తీసుకువెళ్తారు. నీల్ ద్వీపం కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాలి. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్‌కు వెళ్లి చెక్ ఇన్ చేయాలి. రిఫ్రెష్ అయిన తర్వాత సహజ వంతెన, లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. నీల్ ద్వీపంలోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది. ఐదోరోజు నీల్ ద్వీపంలోని హోటల్‌లో అల్పాహారం ముగించుకుని చెక్ అవుట్ అవ్వాలి. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. విశ్రాంతి, షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది. ఆరో రోజు ఉదయం అల్పాహారం చేసిన తర్వాత హోటల్‌లో చెక్ అవుట్ అవ్వాలి. ఉ.7:45 గంటలకు విశాఖపట్నానికి విమానం బయలుదేరుతుంది. ఉ.11:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అండమాన్ టూర్ ప్యాకేజీలో సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.63,525, డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.47,270, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.45,765గా ధరలు వసూలు చేస్తారు. ప్రయాణ టిక్కెట్లు, హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి.