NTV Telugu Site icon

Sambhal Violence: కోర్టు ఆదేశాలతో సంభల్‌లోని ఓ మసీదులో సర్వే.. చెలరేగిన అల్లర్లు, ఇంటర్నెట్ బంద్

Up

Up

Sambhal Violence: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన సంభల్‌లో కోర్టు ఆదేశాల మేరకు ఓ మసీదులో సర్వే చేస్తుండగా ఆదివారం ఉదయం చెలరేగిన అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పట్టణంలో మొగల్‌ కాలానికి చెందిన జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న పిటిషను మేరకు స్థానిక న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో గత మంగళవారం నుంచి సంభల్‌లో ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న (ఆదివారం) పెద్ద గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు మసీదు ముందు పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళన చేశారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వి, వెహికిల్స్ కు నిప్పు పెట్టేందుకు యత్నించారు.

Read Also: IPL 2025 Auction: తొలిరోజు వేలం త‌ర్వాత 10 జ‌ట్ల వ‌ద్ద మిగిలిన ప‌ర్సు విలువ‌లు..

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలు ఝళిపించి, బాష్పవాయువు, ప్లాస్టిక్‌ బుల్లెట్లు ప్రయోగించిన ఆ గుంపును చెదరగొట్టేందుకు ట్రై చేశారు. కొంత మంది దుండగులు ఇళ్ల నుంచి కాల్పులు జరపగా.. సర్కిల్‌ అధికారితో పాటు దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారు. నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నామని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. సంభల్‌ పరిధిలో 24 గంటల పాటు ఇంటర్నెట్‌ సేవలను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 12వ క్లాస్ వరకు అన్ని విద్యాలయాలకు ఈరోజు (సోమవారం) సెలవు ఇచ్చారు. ఇద్దరు మహిళలు సహా 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.