Republic Day: రిపబ్లిక్ డే లక్ష్యంగా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు కలిసి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ కుట్రకు ‘‘26-26’’ అని కోడ్ నేమ్ పెట్టినట్లు సమాచారం. ఈ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also: Kerala Woman: కేరళ బస్ వైరల్ వీడియో.. నిందితురాలు షింజితా ముస్తాఫా అరెస్ట్..
ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీసులు అల్ ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెట్(AQIS) ఉగ్రవాది, ఢిల్లీకి చెందిన మహ్మద్ రెహాన్ ఫోటోలతో వాంటెడ్ జావితాను విడుదల చేసింది. ఇదే కాకుండా, బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు సూత్రధారిగా భావిస్తున్న షాహిద్ ఫైసల్ పేరును కూడా నోటీసుల్లో చేర్చింది.
ఇంటెల్ నివేదికల ప్రకారం, దేశవ్యాప్తగా రిపబ్లిక్ డే రోజు ఒకే సారి పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని, ప్రజల్లో భయాందోళన రేకెత్తించాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కుట్రలో పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్‌లో దాడికి సంకేతాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రామ మందిరం కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
