Tejaswi Yadav: బిహార్‌లో ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడుల తర్వాత ఆ రాష్ట ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని అధికార పక్షం తమకు ఆధిక్యత లేని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలను పంపుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీకి ముగ్గురు అల్లుళ్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ (ఐటీ)లను కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన ముగ్గురు అల్లుళ్లని ఆయన విమర్శలు గుప్పించారు. తలవంచలేని, కొనుగోలు చేయలేని వారిపై బీజేపీ ఈ ఏజెన్సీలను ప్రయోగిస్తుందని శాసనసభలో ఆయన ఆరోపించారు. తమ భాగస్వామ్యం (నితీష్‌తో) అద్భుతాలు చేస్తుందని ఆయన అన్నారు. తేజస్వి యాదవ్, అతని సహచరులకు చెందిన గురుగ్రామ్ మాల్‌లో బుధవారం తెల్లవారుజామున సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు నిర్వహించింది.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో బిహార్‌లో జరిగిన భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరుపుతోంది.
Bihar Assembly Floor Test: బలపరీక్షలో ఏకగ్రీవంగా నెగ్గిన నితీష్‌కుమార్ ప్రభుత్వం
బిహార్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బలపరీక్ష రోజే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. బిహార్‌లో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ముగ్గురు ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, సుబోధ్ రాయ్‌లకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఉదయం ఈ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కుంభకోణానికి సంబంధించి సీబీఐ బుధవారం 25 వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీ, హర్యానాలోని గురుగ్రామ్, బిహార్‌లోని పాట్నా, కతిహార్, మధుబనిలోని వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. గురుగ్రామ్ సెక్టార్ 65లోని వరల్డ్‌మార్క్ భవనంలో ఉన్న వైట్‌ల్యాండ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాడులు జరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
