Bangladesh Violence: బంగ్లాదేశ్ మరోసారి హింసతో అట్టుడుకుతోంది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత ఆ దేశం భగ్గుమంది. రాడికల్ శక్తులు అక్కడి మీడియాతో పాటు హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. మైమన్సింగ్ జిల్లాలో ఒక హిందూ కార్మికుడిని దైవదూషణ ఆరోపణలతో దారుణంగా హత్య చేశారు. ఢాకాతో పాటు చిట్టగాంగ్ సహా ఇతర అన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే, బంగ్లాలో కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజన్స్ పార్టీ (NCP) బంగ్లాదేశ్ నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల భారత్‌ను బెదిరించే వ్యాఖ్యలు చేయడంపై త్రిపుర రాష్ట్రంలో విద్యార్థులు, భారత ప్రజలు అగర్తలాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముందు నిరసన చేపట్టారు. త్రిపురలోని అతిపెద్ద గిరిజన యువజన సంఘాలలో ఒకటైన యూత్ టిప్రా ఫెడరేషన్ (YTF) ఈ ప్రదర్శనను నిర్వహించింది. ఇటీవల హస్నత్ మాట్లాడుతూ.. భారత్ బంగ్లాదేశ్‌ను అస్థిరపరిచే చర్యలకు దిగితే, తాము సెవన్ సిస్టర్స్ (ఈశాన్యరాష్ట్రాలను) ఒంటరిగా చేసే శక్తులకు మద్దతు ఇస్తామని, దీని ద్వారా బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై త్రిపుర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం జరిగిన నిరసనల్లో YTF అధ్యక్షుడు సూరజ్ దేబ్బర్మ మాట్లాడుతూ, 1971 విముక్తి యుద్ధంలో భారతదేశం మద్దతు, భారత సైన్యం త్యాగాలతో బంగ్లాదేశ్ ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం, బంగ్లాదేశ్ కొత్త తరం ఇది మరిచిపోయినట్లు కనిపిస్తోందని అన్నారు. ఇప్పుడున్న జనరేషన్ భారత్‌ను శత్రువుగా చిత్రీకరిస్తోందని, ఇది చాలా దురదృష్టకరం అని అన్నారు.
అంతకుముందు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే ‘‘సిలిగురి కారిడార్’’ను దిగ్బంధించి ఈశాన్య భారతాన్ని వేరు చేస్తామని బంగ్లా మాజీ ఆర్మీ అధికారి వ్యాఖ్యల్ని కూడా దేబ్బర్మ ప్రస్తావించారు. ఈశాన్య ప్రాంతాలకు సముద్ర మార్గం లేదని బంగ్లాదేశ్ కు గుర్తు చేస్తూనే, త్రిపుర ప్రజల నుంచి ప్రతిచర్యకు దారి తీసే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరోక్షంగా, బంగ్లాదేశ్ రేవుపట్టణం ఉన్న చిట్టగాంగ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఏడాది ప్రారంభంలో వైటీఎఫ్ అధ్యక్షుడు దక్షిణ త్రిపురలోని బెలోనియా పట్టణలో భారత్-బంగ్లా సరిహద్దు వద్ద నిర్మితమవుతున్న ఒక కట్టకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బంగ్లాదేశ్‌తో ఉన్న 4000 కి.మీ పొడవైన సరిహద్దుకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని దెబ్బర్మ కేంద్రాన్ని కోరారు. కేంద్ర విఫలమైతే తన భూమిని, ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్థానిక ప్రజలకు అధికారం ఇవ్వాలని అన్నారు.
