Modi Farming Mantra: సహజ వ్యవసాయంపై ప్రధాని నరేంద్రమోడీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. లింక్డ్‌ఇన్ పోస్టులో సహజ వ్యవసాయం గొప్పతనాన్ని ఆయన వివరించారు. సహజ వ్యవసాయం అనేది ఆధునిక పర్యావరణ శాస్త్రాలను సమన్వయం చేసుకుని, ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు లేకుండా పంటలను పండించే ఒక విధానం. ఇందులో ఒకే క్షేత్రంలో పంటలు, చెట్లు, పశువులు కలిసి జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి. బయట నుంచి ఎరువులు, మందుల వంటివి వాడకుండా, ఆ వ్యవసాయ క్షేత్రంలో లభించే పేడ, పచ్చిరొట్ట వంటి వాటివి వినియోగించుకుని, మల్చింగ్ వంటి వాటితో నేల సారాన్ని పెంచడం ఈ విధానంలో ముఖ్య లక్షణం.
కోయంబత్తూర్ సదస్సును మరిచిపోలేను:
ఇటీవల, ప్రధాని మోడీని ‘‘దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు-2025’’కు ఆహ్వానించారు. కోయంబత్తూర్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. దీనిపై మాట్లాడుతూ.. ‘‘ ఈ ఏడాది ఆగస్టులో, తమిళనాడుకు చెందిన కొంత మంది రైతులను నేను కలిశాను. వారు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతూ, పర్యావరణ అనుకూలంగా ఉండే కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్లు చెప్పారు. కొయంబత్తూర్‌లో జరిగిన సహజ వ్యవసాయ సదస్సుకు నన్ను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని నేను అంగీకరించి, ఆ సదస్సులో పాల్గొంటానని హామీ ఇచ్చాను. నవంబర్ 19న ఈ సదస్సులో పాల్గొన్నాను. సాధారణంగా MSME రంగానికి ప్రసిద్ధి చెందిన కోయంబత్తూర్ నగరం, సహజ వ్యవసాయంపై సదస్సు నిర్వహించడం విశేషం’’ అని చెప్పారు. కోయంబత్తూర్ సదస్సు తనకు ఎప్పటికీ గుర్తుంటుందని ప్రధాని చెప్పారు. భారత రైతులు, వ్యవసాయం పట్ల మక్కువ, ఉత్సాహం ఉన్న వారు వ్యవసాయాన్ని ఎలా కొత్త దృక్పథంతో నడిపిస్తున్నారనే దానికి ఇది గొప్ప ఉదాహరణ అని తన పోస్టులో ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమంలో చాలా రాష్ట్రాల రైతులతో మాట్లాడినట్లు మోడీ గుర్తు చేసుకున్నారు.
రైతులపై ప్రశంసలు:
ఒక రైతు 10 ఎకరాల్లో బహుళ స్థాయి సాగు చేస్తూ, అరటి, కొబ్బరి, బొప్పాయి, మిరియాలు, పసుపు వంటి పంటలను పెంచుతున్నారని, 60 దేశీ ఆవులు, 400 మేకలు ఉన్నట్లు ప్రధాని చెప్పారు. మప్పిళ్లై సంబా అనే మరో రైతు ‘‘కరుప్పు కావుని’’ వంటి స్వదేశీ బియ్యం రకాలకు తన జీవితాన్ని అంకితం చేశారని పోస్టులో వెల్లడించారు. ఫస్ట్ జనరేషన్‌కు చెందిన ఒక గ్రాడ్యుయేట్ 15 ఎకరాల్లో సహజ వ్యవసాయం చేస్తూ, 3000 మందికి పైగా రైతులకు శిక్షణ ఇచ్చారని, ప్రతీ నెల దాదాపుగా 30 టన్నుల కూరగాయలను సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(FPOలు) కసావా రైతులను ప్రోత్సహిస్తూ, బయో ఇథనాల్, క్రంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీలో కసావా ముడి ఉత్పత్తుల్ని వాడేలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. బయో టెక్నాలజీలో నిపుణుడైన మరో వ్యక్తి సముద్ర శైవలాల ఆధారంగా బయో ఫర్టిలైజర్ తయారు చేసే సంస్థను ప్రారంభించి, తీర ప్రాంతాల్లో 600 మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. వీరందరిలో మట్టిని కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలనే సంకల్పం కనిపించిందని మోడీ చెప్పారు.
ఒక ఎకరం-ఒక సీజన్:
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘‘జాతీయ సహజ వ్యవసాయ మిషన్’’ను ప్రారంభించిందని, దీని ద్వారా లక్షలాది మంది రైతులు సహజ పద్ధతులకు మారుతున్నారని, దేశవ్యాప్తంగా వేల హెక్టార్లలో సహజ వ్యవసాయం జరుగుతోందని ప్రధాని వెల్లడించారు. ఎగుమతుల ప్రోత్సాహం, క్రెడిట్ కార్డ్ ద్వారా సౌకరవ్యవంతమైన రుణాలు, పీఎం కిసాన్ పథకాల వల్ల సహజ వ్యవసాయం మరింత వేగంగా విస్తరిస్తోందని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళా రైతులు అధికంగా ఈ పద్ధతికి ఆకర్షితులు అవ్వడం ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.
గత కొన్నేళ్లుగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం నేర సారాన్ని, తేమను తగ్గించిందని, ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగాయని ప్రధాని అన్నారు. వీటన్నింటికి సహజ వ్యవసాయం పరిష్కరిస్తుందని చెప్పారు. ఒక ఎకరం-ఒక సీజన్‌లో ఈ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయాలని తాను రైతులను ప్రోత్సహిస్తున్నానని, చిన్న స్థాయిలో వచ్చిన ఫలితాలు వారికి నమ్మకాన్ని ఇస్తాయని అన్నారు. కోయంబత్తూర్ లో రైతులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్స్ ఇలా అందరూ ఒకే చోటుకు రావడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లు మోడీ అన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం రంగాన్ని ఉత్పాదకంగా, పర్యావరణ అనుకూలంగా మార్చుతామని నమ్ముతున్నట్లు చెప్పారు.
