NTV Telugu Site icon

Super Vasuki Train: ఆరు ఇంజిన్‌లు.. 295 బోగీలు.. దేశంలో అతి పెద్ద పొడవైన రైలు ఇదే..!!

Super Vasuki Train

Super Vasuki Train

Super Vasuki Train: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 15న అతి పెద్ద రైలును నడిపి భారతీయ రైల్వే రికార్డు సృష్టించింది. సాధారణంగా గూడ్స్ బండికే 100 అంతకంటే ఎక్కువ బోగీలు కనిపిస్తుంటాయి. గూడ్స్ ట్రైన్ వెళ్తుంటే కొంతమంది సరదాగా బోగీలు లెక్కపెడుతుంటారు. అయితే ఆగస్టు 15న ఇండియన్ రైల్వేస్ నడిపిన రైలుకు ఎన్ని బోగీలు ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఈ రైలుకు ఏకంగా 295 బోగీలు ఉన్నాయి. ఈ రైలు పొడవు 3.5 కిలోమీటర్లు. ఇంత పెద్ద రైలును నడిపేందుకు ఏకంగా ఆరు ఇంజిన్‌లు ఉన్నాయి. ఈ రైలుకు ఇండియన్ రైల్వే అధికారులు ‘సూపర్ వాసుకి’ అని నామకరణం చేశారు. ఈ రైలుకు సంబంధించిన వీడియోలను తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తోపాటు, ఆగ్నేయ మధ్య రైల్వే అధికారులు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

Read Also: Dubai Crown Prince: సామాన్యుడిలా మెట్రోరైలులో ప్రయాణించిన యువరాజు.. ఎవరూ గుర్తుపట్టలేదు..!!

ఆగ్నేయ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఛత్తీస్‌ గఢ్‌లోని భిలాయ్‌ నుంచి కోర్బా వరకు దీనిని నడిపారు. ఈ రైలులో ఏకంగా 27 వేల టన్నుల బొగ్గును ఒకేసారి తరలించారు. ఒకే రైలులో ఇంత భారీగా సరుకు రవాణా చేయడం రైల్వేల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ రైలులో తరలించిన బొగ్గుతో 3 వేల మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఒకరోజంతా నడపవచ్చని అధికారులు వివరించారు. విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరతను నివారించడం, తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ బొగ్గు సరఫరా కోసం రైల్వే అధికారులు ఇలాంటి పొడవైన రైళ్లను వినియోగిస్తున్నారు. రెండు, మూడు రైళ్లకు బదులు ఒకే రైలును నడపడం వల్ల రైల్వే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు. గతంలో వాసుకి, త్రిశూల్ పేర్లతో అతి పొడవైన గూడ్స్ రైళ్లను నడిపినా.. వాటి పొడవు 2.8 కిలోమీటర్లలోపే ఉండటం గమనించదగ్గ విషయం.