కరోనా వైరస్ పంజా విసిరనప్పటి నుంచి క్రమంగా రైళ్లు పట్టాలు ఎక్కడం తగ్గిపోయింది.. అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతూ వచ్చినా.. పూర్తిస్థాయిలో నడపలేదు.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ కలకలం సృష్టించడంతో.. నడిచే రైళ్లు కూడా నిలిపివేసిన పరిస్థితి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలు మెట్రో రైళ్లను, ఎంఎంటీఎస్‌లను క్రమంగా పట్టాలెక్కిస్తున్నాయి.. మరోవైపు రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజర్లతో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతుండగా.. పలు రూట్లలో పెద్ద ఎత్తున రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ..
రైల్వేశాఖ తాజా నిర్ణయం ప్రకారం.. గరీబ్ రథ్ స్పెషల్ తాజ్ ఎక్స్‌ప్రెస్, షాన్-ఎ-పంజాబ్, ముంబై సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్ ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 50కిపైగా రైళ్లను తిరిగి ప్రారంభంకానున్నాయి. ముంబై సెంట్రల్ నిజాముద్దీన్ ఆగస్ట్ క్రాంతి రాజధాని స్పెషల్ శనివారం నుంచి నడుస్తుండగా.. షాజహాన్‌పూర్-సీతాపూర్ సిటీ, సీతాపూర్ సిటీ- షాజహాన్‌పూర్ రిజర్వుడ్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇక, లక్నో-వారణాసి ఇంటర్‌సిటీ స్పెషల్, వారణాసి-లక్నో ఇంటర్‌సిటీ స్పెషల్ సోమవారం నుంచి లైన్‌లోకి రానుంది. వారణాసి – ఆనంద్ విహార్, ఆనంద్ విహార్ – వారణాసి, గరీబ్ రథ్ స్పెషల్ రైళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి పట్టాలు ఎక్కనుండగా.. గరీబ్ రథ్ స్పెషల్ ఆనంద్ విహార్ – ముజఫర్‌పూర్ ట్రైన్ 7వ తేదీ నుంచి నడువనుంది. ఈ నెల 5 నుంచి న్యూఢిల్లీ – ఝాన్సీ తాజ్‌ఎక్స్‌ప్రెస్ స్పెషల్, ఝాన్సీ – న్యూఢిల్లీ తాజ్‌ఎక్స్‌ప్రెస్ స్పెషల్ పట్టాలెక్కనున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.. ప్రజలకు ప్రయాణం మళ్లీ చౌకగా, సురక్షితంగా, సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు రైల్వేశాఖ మంత్రి పీయూల్ గోయల్.. కాగా, కోవిడ్ కారణంగా రైళ్లు నడకపోవడంతో.. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. అత్యవసరం అయి వెళ్లినా జేబుకు చిల్లుపడిపోతున్న సంగతి తెలిసిందే.