Site icon NTV Telugu

Indian Railways: 2021తో పోలిస్తే 2022లో రైల్వేశాఖకు భారీగా పెరిగిన ఆదాయం

Indian Railways

Indian Railways

Indian Railways: 2021తో పోలిస్తే 2022లో భారతీయ రైల్వేలకు భారీగా ఆదాయం సమకూరింది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు 71శాతం వృద్ధి కనబరిచిందని రైల్వేశాఖ వెల్లడించింది. 2022 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ మధ్య కాలంలో కేవలం ప్రయాణికుల నుంచి రూ.48,913 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే శాఖ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కేవలం రూ.28,569 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని గుర్తుచేసింది. రిజర్వుడ్ ప్యాసింజర్ కేటగిరీలో రూ.38,482 కోట్ల ఆదాయం వచ్చిందని.. ఇది గత ఏడాదితో పోలిస్తే 56 శాతం అధికమని వెల్లడించింది.

Read Also: Pawan Kalyan: అన్నయ్య నుంచి అదే నేర్చుకున్నా.. బాలయ్య షోలో చిరు గురించి చెప్పిన పవన్

2022 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య అన్‌రిజర్వుడ్ ప్యాసింజర్ల నుంచి వచ్చిన ఆదాయం రూ.10,430 కోట్లుగా ఉందని తెలిపింది. గత ఏడాది ఈ సంఖ్య రూ.2,169 కోట్లుగా ఉందని వివరించింది. 2022 ఏప్రిల్, డిసెంబర్ మధ్య రిజర్వ్ ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ వ్యవధిలో 59.61 కోట్ల బుకింగ్స్ జరిగాయని తెలిపింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ అని పేర్కొంది. కాగా 2021లో దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ కారణంగా ప్రయాణాలపై కఠిన ఆంక్షలు ఉండేవి. రైళ్లు కూడా పరిమిత సంఖ్యలోనే తిరిగాయి. దీంతో రైల్వే శాఖ ఆదాయం పడిపోయింది.

Exit mobile version