NTV Telugu Site icon

2036 Olympics: 2036 ఒలింపిక్స్ గేమ్స్‌కి ఇండియా బిడ్డింగ్.. కన్ఫామ్ చేసిన ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

2036 Olympics: 2036 ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలనే ఇండియా అభిప్రాయాన్ని ఆయన నొక్కిచెప్పారు. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ బిడ్డింగ్ వెస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) 141వ సెషన్‌ని మోడీ ప్రారంభించారు. 40 ఏళ్ల విరామం తర్వాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ జరుగుతోంది. భారతదేశంలో చివరి ఒలింపిక్ సెషన్ 1983లో న్యూఢిల్లీలో జరిగింది. 2029 యూత్ ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

ఇది 140 కోట్ల మంది భారతీయుల కల అని.. మీ మద్దతుతో మేము ఈ కలను నెరవేర్చాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. 2029 యూత్ ఒలింపిక్స్‌కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, భారతదేశానికి ఐఓసీ నుంచి నిరంతర మద్దతు లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని ప్రధాని మోడీ అన్నారు. క్రీడా స్పూర్తి విశ్వవ్యాప్తం అని.. ఓడిపోయిన వారు ఉండరని, క్రీడల్లో విజేతలు, అభ్యాసకులు మాత్రమే ఉంటారని చెప్పారు. క్రీడలు మానవాళిని శక్తివంతం చేస్తారు. ఎవరు రికార్డు బద్డలు కొట్టినా, ప్రతీ ఒక్కరూ దాన్ని స్వాగతిస్తారని అన్నారు.

Read Also: IMF: ఇంధన ధరలు, ప్రపంచ జీడీపీపై ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ ప్రభావం..

అంతకుముందు ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ మాట్లాడుతూ.. ‘నమస్తే’ అని పలకరించారు. హిందీలో మాట్లాడుతూ.. ‘ఆప్కా బహుత్ బహుత్ స్వాగత్ హై’ అని ప్రధాని నరేంద్రమోడీని స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఒక స్పూర్తిదాయకమైన ప్రదేశమని అన్నారు. ఆర్టిఫిషియల్(AI) గురించి మాట్లాడుతూ.. ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయబడిందని, రాబోయే రెండు రోజుల్లో జరగనున్న 141వ ఐఓసీ సెషన్ లో దీనిపై మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఏఐ, ఈ-స్పోర్ట్స్ ఒలింపిక్ ఉద్యమానికి రెండు కొత్త అవకాశాలని బాచ్ అన్నారు. 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రీ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి చివరిదని తెలిపారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొణే పాల్గొన్నారు.

అంతకుముందు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి మరింత ఆదరణ లభిస్తున్నందున 2028 ఒలింపిక్స్ లో క్రికెట్‌కి చోటు కల్పిస్తున్నట్లు శుక్రవారం థామస్ బాచ్ మీడియా సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం భారత్ విజయవంతంగా వన్డే ప్రపంచకప్ నిర్వహిస్తోందని, భారతీయులు, భారత సంతతి ప్రజలు క్రికెట్ ఆడుతారని, ఇటీవల తాము డల్లాస్ లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని ఆయన తెలిపారు. అందువల్లే లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్‌కి చోటు కల్పించినట్లు వెల్లడించారు.