Site icon NTV Telugu

Air Crash: సంజయ్ గాంధీ, విజయ్ రూపానీ, వైఎస్ఆర్.. విమాన ప్రమాదాల్లో మరణించిన రాజకీయ నేతలు..

Indian Politicians Who Died In Air Crashes

Indian Politicians Who Died In Air Crashes

Air Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు. దీంతో గుజరాత్ బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. అయితే, విజయ్ రూపానీలాగే గతంలో కూడా భారత రాజకీయ ప్రముఖులు విమాన ప్రమాదాల్లో మరణించారు.

సంజయ్ గాంధీ (1980)

మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కుమారుడు, ఒకప్పుడు ఆమె రాజకీయ వారసుడిగా పరిగణించబడిన సంజయ్ గాంధీ జూన్ 23, 1980న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 33 ఏళ్ల ఆయన రెండు సీట్ల విమానం నడుపుతుండగా సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం సమీపంలో టెస్ట్ ఫ్లైట్ కూలిపోయింది.

మాధవ్‌రావు సింధియా (2001)

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి, మాధవరావు సింధియా భారత రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు. మధ్యప్రదేశ్‌లో రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. గ్వాలియర్ రాజకుటుంబ సభ్యుడు. ఆయన సెప్టెంబర్ 30, 2001న ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా భోగావ్‌లో జరిగిన చార్టర్డ్ విమాన ప్రమాదంలో సింధియా మరణించారు. కాన్పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించడానికి ఆయన వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్నవాళ్లందరూ మరణించారు.

జిఎంసి బాలయోగి (2002)

అప్పటి లోక్‌సభ స్పీకర్, తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకుడు జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్‌లో గాలిలో ఉండగానే మెకానికల్ ఫెయిల్యూర్ తలెత్తింది.

వైఎస్ రాజశేఖర రెడ్డి (2009)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్‌లో మరణించారు. సెప్టెంబర్ 2, 2009న నల్లమల కొండలలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగిన ఒక రోజు తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించారు.

దోర్జీ ఖండు (2011)

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు ఏప్రిల్ 30, 2011న చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన వైమానిక ప్రమాదంలో మరణించారు. పవన్ హన్స్ హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. ఐదు రోజుల తర్వాత శిథిలాలు కనుగొనబడ్డాయి.

ఓపీ జిందాల్, సురేందర్ సింగ్ (2005)

పారిశ్రామికవేత్త, హర్యానా విద్యుత్ మంత్రి ఓపీ జిందాల్, మాజీ కేంద్ర మంత్రి సురేందర్ సింగ్ (మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కుమారుడు)తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో, మార్చి 31, 2005న ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

గుర్నామ్ సింగ్ (1973)

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కూడా మే 31, 1973న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.

బల్వంత్రాయ్ మెహతా (1965)

గుజరాత్ రెండవ ముఖ్యమంత్రి బల్వంత్రాయ్ మెహతా ప్రయాణిస్తు్న్న హెలికాప్టర్‌ని పాకిస్తాన్ కూల్చేసింది. 1965 యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దళం జెట్ పొరపాటున పౌర విమానాన్ని కూల్చివేసింది . మెహతా భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అధికారిక పర్యటనలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

Exit mobile version