Pannun Case: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యాయత్నం కేసులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం భారత్-అమెరికా సంబంధాల్లో ఒడిదొడుకులకు కారణమైంది. కిరాయి ముఠాలతో పన్నూను హతమార్చేందుకు మాజీ భారతీయ నిఘా అధికారిగా గుర్తించబడిన ‘CC-1’పై అమెరికాలో అభియోగాలు దాఖలయ్యాయి. అయితే, ఈ కేసులో కీలక పరిణామం సంభవించింది. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది.
అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూని చంపడానికి సదరు వ్యక్తి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత, డ్రగ్స్ మాఫియా, క్రిమినల్ ముటాలతో ఆ వ్యక్తి ఉన్న సంబంధాలను పరిశోధించడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అతడి మునుపటి నేర సంబంధాలు కూడా విచారణ సమయంలో వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది.
‘CC-1’ అని పిలువబడే వ్యక్తిని తరువాత యూఎస్ ఏజెన్సీ FBI వికాష్ యాదవ్ గా గుర్తించింది. ఇతను భారత గూఢచార సంస్థ ‘‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్(R&AW)’’ మాజీ అధికారి. విచారణ కమిటీ సొంత దర్యాప్తుతో పాటు అమెరికా వైపు నుంచి వచ్చిన ఆధారాలను కూడా పరిశీలించింది. ఈ కేసులో రెండు దేశాల అధికారులు పరస్పరం సహకరించుకున్నారు.
Read Also: Shridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి.. కేంద్రమంత్రికి వినతి
ఏంటీ ఈ కేసు..?
గురుపత్వంత్ సింగ్ పన్నూ ఖలిస్తానీ ఉగ్రవాది. ఇతడిని చంపేందుకు వికాశ్ యాదవ్ కిరాయి హత్యకు ప్లాన్ చేసినట్లు అభియోగాలు ఉన్నట్లు, న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ తెలిపింది. ఈ హత్యాయత్నంలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఎఫ్‌బీఐ ఆరోపించింది. యూఎస్ పౌరులపై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యల్ని ఎఫ్‌బీఐ సహించదని అప్పటి డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే అన్నారు.
ఈ హత్యని అమలు చేయడానికి 2023లో మేలో భారతీయుడైన నిఖిల్ గుప్తాని నియమించుకున్నట్లు వికాశ్ యాదవ్‌పై ఆరోపనలు ఉన్నాయి. యూఎస్ ఇచ్చిన సమచారంతో చెక్ రిపబ్లిక్‌లో నిఖిల్ గుప్తాని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇతడిని అమెరికాకు అప్పగించారు. వికాశ్ యాదవ్ ఈ హత్య కోసం ఒక వ్యక్తికి 1,00,000 డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపించారు. ఈ కిరాయి హంతకుడు అండర్‌కవర్‌గా పనిచేస్తున్న ఏజెన్సీ ఇన్ఫార్మర్ అని ఎఫ్‌బీఐ తెలిపింది.