NTV Telugu Site icon

Turkey Earthquake: టర్కీ భూకంపంలో భారతీయుడి మృతి.. “ఓం” అనే పచ్చబొట్టుతో గుర్తింపు

Turkey Earthquake

Turkey Earthquake

Turkey Earthquake: టర్కీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరసగా గంటల వ్యవధిలో వచ్చిన రెండు భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల రెండు దేశాల్లో కలిపి 28,000 మందికి పైగా మరణించారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిథిలాలు తొలగించినా కొద్దీ శవాలు బయటపడుతున్నాయి.

ఇదిలా ఉంటే టర్కీ భూకంపంలో ఒక భారతీయుడు మరణించాడు. మృతుడిని ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ గా గుర్తించారు. బెంగళూర్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న విజయ్ కుమార్, అధికారిక పర్యటనలో భాగంగా టర్కీకి వెళ్లారు. అతను బస చేసి మాల్యతాలోని హోటల్ భూకంపం ధాటికి కుప్పకూలింది. దీంతో విజయ్ కుమార్ శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. విజయ్ కుమార్ ముఖం గుర్తుపట్టలేనంతగా నలిగిపోయింది. శుక్రవారం అతడి దుస్తులు దొరికాయి. అతని ఒంటిపై ఉన్న ‘ఓం’ అనే పచ్చబొట్టు ఆధారంగా మృతుడు విజయ్ కుమార్ అని గుర్తించారు.

Read Also: Canada: చైనా పనేనా..? కెనడా గగనతలంలో అనుమానాస్పద వస్తువు.. కూల్చేసిన అమెరికా

సోమవారం వచ్చిన భూకంపం తర్వాత విజయ్ కుమార్ ఆచూకీ కనిపించకుండా పోయింది. అయితే తిరిగి వస్తాడనుకున్న కుటుంబ సభ్యులకు ఈ చేదువార్త తెలిసింది. వ్యాపార పర్యటనలో ఉన్న విజయ్ కుమార్ మరణించినట్లు టర్కీలోని భారతరాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఆయన భౌతికకాయాన్ని ముందుగా ఇస్తాంబుల్‌కు తరలించి, అనంతరం ఢిల్లీకి తీసుకువెళతారు. అతని మృతదేహం స్వస్థలానికి చేరుకోవడానికి మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.

బెంగళూరులోని ఆక్సిప్లాంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే గ్యాస్ ప్లాంట్ కంపెనీకి టెక్నీషియన్ అయిన కుమార్ జనవరి 25న టర్కీకి వెళ్లి మాలత్యలోని అవసర్ హాస్టల్‌లో బసచేస్తున్నారు. భూకంపం తర్వాత విజయ్ కుమార్ ను అతని అన్న అరుణ్ కుమార్ సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి ఫోన్ రింగ్ అవుతున్నా.. ఎవరూ స్పందించలేదు. చివరిసారిగా ఫిబ్రవరి 5న భార్య, ఆరేళ్ల కుమారుడితో ఫోన్ లో మాట్లాడారు. ఫిబ్రవరి 20న పని ముగించుకుని ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఈ లోపే భూకంపంలో మరణించారు.

Show comments