NTV Telugu Site icon

Kolkata Doctor case: జేపీ నడ్డాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ

Dacotr

Dacotr

కోల్‌కతా హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్యార్థులు, నర్సులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. బాధితురాలి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి ప్రార్థిస్తున్నారు. అలాగే నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు.

ఇదిలా ఉంటే కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ ఐఎంఏ కేంద్రం ముందు పలు డిమాండ్లు పెట్టింది. కేసు నిష్పక్షపాతంగా, సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అలాగే దోషులకు శిక్ష పడాలని కోరారు. నేరంపై వివరణాత్మక విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళల భద్రతను మెరుగుపరచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖలో కోరింది.

ప్రాథమిక పోస్ట్‌మార్టం రిపోర్టు ప్రకారం.. బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేటు అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లుగా తేలినట్లు సమాచారం. అంతేకాకుండా ఇతర భాగాల్లో కూడా గాయాలు ఉన్నట్లుగా తేలింది. అయితే వైద్యురాలిని మొదట హత్య చేసి.. ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మరో పోలీసు అధికారి వెల్లడించారు.

గురువారం అర్ధరాత్రి వరకు బాధితురాలు కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఒలింపిక్స్ గేమ్స్‌ను తన సహచరులతో చూసినట్లుగా తెలుస్తోంది. అనంతరం దాదాపు 2 గంటల ప్రాంతంలో అందరితో కలిసి డిన్నర్ చేసింది. అనంతరం చదువుకోవడం కోసం ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లోకి వెళ్లింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 3-6 గంటల ప్రాంతంలో ఆమె హత్యాచారానికి గురై ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం బాధితురాలు నగ్నంగా శవమై పడి ఉండడంతో సహచరులు భయాందోళన చెంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే వైదురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇక వైద్యులు విధులు బహిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. ఆందోళనలు ఉధృతం కావడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సోమవారం ఉదయం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు అల్టిమేటం విధించారు. ఆదివారంలోగా కేసు కొలిక్కి తీసుకురాకపోతే సీబీఐకి అప్పగిస్తానని హెచ్చరించారు.

దర్యాప్తుపై వస్తున్న వందతులను పోలీసులు కొట్టిపారేశారు. ఎవరూ పుకార్లు నమ్మొద్దని.. నిష్పాక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో పనిచేసిన సిబ్బందిని విచారించామని.. అలాగే సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కూడా చేపట్టినట్లు వివరించారు.

Show comments