భారత్ సరిహద్దుకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పాకిస్థాన్ చైనాకు చెందిన అత్యాధునిక ఎస్‌హెచ్-15 స్వీయ చోదక హోవిట్జర్ ఫిరంగులను మోహరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలకంగా స్పందించింది. దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, భద్రతను నిర్ధారించేందుకు అవసరమైన ఏ చర్యలైనా తీసుకుంటామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదం పూర్తిగా నిలిచిపోవాలని పునరుద్ఘాటించింది.
విదేశాంగ శాఖ వారపు మీడియా సమావేశంలో ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. దేశ రక్షణ విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా తయారీ ఎస్‌హెచ్-15 స్వీయ చోదక ఫిరంగులను మోహరించినట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఎలా తగిన సమాధానం ఇచ్చిందో మనం చూశాం. సరిహద్దు ఉగ్రవాదం పూర్తిగా ఆగిపోవాలన్నదే మా వైఖరి. దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, ఆత్మరక్షణ కోసం అవసరమైన ఏ చర్యలైనా తీసుకుంటాం. ఈ విషయంలో మేం ఎప్పుడూ అప్రమత్తంగా, సిద్ధంగా ఉంటాం’’ అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ తన ఫిరంగి దళాల ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా భారత్‌కు ఎదురుగా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 250 చైనా తయారీ ఎస్‌హెచ్-15 చక్రాలపై ప్రయాణించే స్వీయ చోదక హోవిట్జర్లను మోహరించినట్లు మీడియా కథనం నివేదించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మీడియా సమావేశంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఇటీవల నిర్వహించిన స్థానిక ఎన్నికలపై కూడా రణధీర్ జైస్వాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఎన్నికలను పూర్తిస్థాయి బూటకమని అభివర్ణించారు. ప్రజల నిరసనలను అణచివేసేందుకు పాకిస్థాన్ బలప్రయోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.
‘‘పీఓకేలో నిర్వహించిన స్థానిక ఎన్నికలు పూర్తిగా బూటకం. అక్కడ వాస్తవంగా జరుగుతున్నది ప్రజల నిరసనలు, పాకిస్థాన్ భద్రతా దళాల విచక్షణారహిత హత్యలే. ఇలాంటి డొల్ల ఎన్నికల ప్రక్రియలు అక్కడి వాస్తవ పరిస్థితులను దాచలేవు’’ అని జైస్వాల్ వ్యాఖ్యానించారు. జూన్ నుంచి పీఓకేలో పాకిస్థాన్ చేపట్టిన అణచివేత చర్యల్లో కనీసం 90 మంది పౌరులు మరణించినట్లు భారత్ పేర్కొంది. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి పాకిస్థాన్ ప్రభుత్వం తూటాలు, విద్యుత్ నిలిపివేతలు, బెదిరింపులు, అణచివేతలతో సమాధానం ఇస్తోందని జైస్వాల్ ఆరోపించారు.
‘‘ప్రజల అసంతృప్తికి పాకిస్థాన్ వ్యవస్థ తూటాలు, చీకట్లు, బెదిరింపులు, అణచివేతలతో స్పందించింది. ఇప్పుడు డొల్ల ఎన్నికల ప్రక్రియ ద్వారా తన పాలనకు చట్టబద్ధత కల్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది’’ అని అన్నారు. పీఓకే పరిస్థితులపై పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా నిలబెట్టాలని ఆయన కోరారు.
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కమాండర్లలో 30 నుంచి 40 మంది మరణించారని, దీనికి భారత ఏజెన్సీలే కారణమని పేర్కొంటున్నట్లు ప్రచారంలో ఉన్న ఓ వీడియోపై కూడా రణధీర్ జైస్వాల్‌ను ప్రశ్నించారు. అయితే ఆ వీడియోలోని నిర్దిష్ట ఆరోపణలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అయినప్పటికీ సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరింది. పాకిస్థాన్ తన భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేసింది.
‘‘సరిహద్దు ఉగ్రవాదం, దానిని ప్రోత్సహించే వారిపై అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని మేం నిరంతరం కోరుతున్నాం. పాకిస్థాన్ కూడా సరిహద్దు ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి. తన భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద మౌలిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలి’’ అని జైస్వాల్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ 2019లో చైనా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ నోరింకో నుంచి 236 ఎస్‌హెచ్-15 155 మిల్లీమీటర్ల, 52 క్యాలిబర్ చక్రాలపై ప్రయాణించే స్వీయ చోదక ఫిరంగి వ్యవస్థలను కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఫిరంగుల సరఫరా 2022లో ప్రారంభమైంది. మరో విడత ఫిరంగులు 2023లో పాకిస్థాన్‌కు చేరినట్లు సమాచారం. ఈ ఫిరంగి వ్యవస్థలను దేశీయంగా తయారు చేసేందుకు పాకిస్థాన్‌కు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందం కూడా లభించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన హెవీ ఇండస్ట్రీస్ టాక్సిలా సంస్థలో ఈ వ్యవస్థలను తయారు చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
చైనాలో పీసీఎల్-181గా పిలిచే ఎస్‌హెచ్-15 ఫిరంగులను పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలా, సియాల్‌కోట్, జలాల్‌పూర్ జట్టాన్ ప్రాంతాల్లో మోహరించినట్లు సమాచారం. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన షకర్‌గఢ్ ప్రాంతానికి సమీపంలో భారత్‌కు ఎదురుగా ఈ ఫిరంగులను మోహరించినట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. 155 మిల్లీమీటర్ల ఎస్‌హెచ్-15 ఫిరంగి వ్యవస్థ రాకెట్ సహాయంతో ప్రయోగించే ప్రక్షేపకాల ద్వారా 50 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల మందుగుండు సామగ్రిని ప్రయోగించే సామర్థ్యం కూడా దీనికి ఉంది.
ఈ ఫిరంగి వ్యవస్థల మోహరింపుతో పాకిస్థాన్ సుదూర లక్ష్యాలను ఛేదించే సాంప్రదాయ ఫిరంగి సామర్థ్యం మరింత బలపడుతుందని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు కూడా ఈ వ్యవస్థలు అదనపు బలాన్ని అందిస్తాయని అంచనా వేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఫిరంగుల మోహరింపు వార్తలు వెలువడ్డాయి. సరిహద్దు ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత అంశాలపై న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య దౌత్యపరమైన మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ చైనా తయారీ ఫిరంగుల మోహరింపు కొత్త చర్చకు దారితీసింది.

