Site icon NTV Telugu

India-UK trade deal: భారత్-యూకేల మధ్య కుదిరిన అతిపెద్ద ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’’

Modi

Modi

India-UK trade deal: భారత్, యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)ల మధ్య అతిపెద్ద ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)’’ కుదిరింది. గురువారం మైలురాయిగా నిలిచే ఈ ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్స్ సంతకాలు చేశారు. 2020లో యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి యూకే నిష్క్రమించిన తర్వాత, ఆ దేశం చేసిన అతిపెద్ద ఒప్పందం ఇదే. లండన్‌లో మోడీ, స్టార్మర్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

Read Also: Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత, ‘‘సిక్ లీవ్‌లు’’ పెట్టిన 112 మంది పైలట్లు

ఎఫ్‌టీఏపై ఇరు దేశాల ప్రధానుల ప్రశంసలు..

ఒప్పందం అనంతరం ప్రధాని మోడీ, స్టార్మర్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ) భారత్, యూకేల ఉమ్మడి శ్రేయస్సుకు బ్లూ ఫ్రింట్ అని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు మన సంబంధాలలో ఒక చారిత్రాత్మక రోజు. అనేక సంవత్సరాల కృషి తర్వాత, నేడు మన రెండు దేశాలు సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం నాకు సంతోషంగా ఉంది’’ అని ప్రధాని మోడీ అన్నారు.

‘‘ భారతీయ వస్త్రాలు, ఫుట్ వేర్, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులు యూకేలో మెరుగైన మార్కెట్ యాక్సెస్ పొందుతాయి. భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమలకు యూకే మార్కెట్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. ఈ ఒప్పందం భారతీయ యువత, రైతులు, మత్స్యకారులకు, MSME రంగానికి ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని మోడీ చెప్పారు. అదే విధంగా ఇండస్ట్రియర్, వైద్య పరికరాలు, ఏరోస్పేస్ విడిభాగాల వంటి యూకే తయారీ ఉత్పత్తులు భారత్‌లో సరసమైన, పోటీ ధరలకు పొందవచ్చని చెప్పారు.

రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం యూకేకి భారీ ప్రయోజనాలను తెస్తుందని చెప్పారు. ‘‘EU నుండి నిష్క్రమించిన తర్వాత UK చేసుకున్న అతిపెద్ద ,ఆర్థికంగా అత్యంత ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం ఇది. భారతదేశం ఇప్పటివరకు చేసుకున్న సమగ్ర వాణిజ్య ఒప్పందాలలో ఇది ఒకటి’’ అని ఆయన అన్నారు. భారతదేశం ఎఫ్‌టీఏపై సంతకం చేయడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృత పరస్పర సుంకాల బెదిరింపులు, ప్రపంచ అనిశ్చితుల మధ్య యూకే వ్యాపారానికి తెరిచి ఉందనే స్పష్టమైన సందేశాన్ని పంపుతోందని స్టార్మర్ అన్నారు. ఈ ఒప్పందం యూకేలో ఒప్పందాలు, పెట్టుబడులు, వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.

Read Also: Thailand Cambodia war: థాయిలాండ్-కంబోడియా వార్.. “హిందూ దేవాలయం” కోసం బౌద్ధ దేశాల యుద్ధం..

రెండు దేశాల మధ్య పెరుగనున్న వ్యాపారం..

ఈ ఒప్పందం ప్రకారం, 99 శాతం భారతీయ వస్తువులు యూకే మార్కెట్‌లో ఎలాంటి సుంకాలు లేకుండా దొరుకుతాయి. అదే సమయంలో యూకే ఉత్పత్తులు కూడా భారతదేశ మార్కెట్‌ లోకి విస్తృత యాక్సెస్ దొరుకుతుంది. ఈ ఒప్పందంతో రెండు దేశాలు 2030 నాటికి వాణిజ్య విలువ రెట్టింపు చేసి, 120 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. యూకేకి భారతీయ కంపెనీలు ఉద్యోగుల్ని పంపడం సులభం అవుతుంది.

ప్రస్తుతం యూకే, భారత్‌లో ఆరో అతిపెద్ద పెట్టుబడిదారు. మొత్తం పెట్టుబడులు దాదాపు 36 బిలియన్ డాలర్లు. దాదాపు 1000 భారతీయ కంపెనీలు యూకేలో పనిచేస్తున్నాయి. వీటిలో లక్ష మందికి ఉపాధి పొందుతున్నారు. దాదాపు 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు. UKకి భారతదేశ ఎగుమతులు 2024-25లో 12.6 శాతం పెరిగి USD 14.5 బిలియన్లకు చేరుకోగా, దిగుమతులు అదే కాలంలో 2.3 శాతం పెరిగి USD 8.6 బిలియన్లకు చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24లో USD 21.34 బిలియన్లకు పెరిగింది. అంతకుముందు ఏడాది ఇది 20.36 బిలియన్ డాలర్లగా ఉండేది.

Exit mobile version