Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ గెలుపొందిన తర్వాత భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించడమే కాకుండా, చైనాతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఇండియాను కాదని చైనాతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముయిజ్జూ నేరుగా భారత్ పేరు చెప్పకుండా తమను ఎవరూ బెదిరించలేరంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా సంబంధాలు దెబ్బతిన్నాయి.
Read Also: Israel: ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ అప్రమత్తం.. జీపీఎస్ నిలిపివేత, సైనికులకు సెలవులు రద్దు..
దౌత్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. మాల్దీవులకు భారత్ అవసరమైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. చక్కెర, గోధుమలు, బియ్యం, ఉల్లిపాయలతో సహా నిత్యావసర వస్తువులను పరిమితంగా ఎగుమతి చేస్తోందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. బియ్యం, చక్కెర, ఉల్లిపాయల ఎగుమతిలో ప్రపంచంలో అగ్రగామిగా భారత్ ఉంది. అయితే, దేశీయంగా ఈ వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసేందుకు వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అయితే కొన్ని దేశాల నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవులను ఈ బ్యాన్ నుంచి మినహాయించింది.
మాల్దీవులకు 124,218 మెట్రిక్ టన్నుల బియ్యం, 109,162 టన్నుల గోధుమ పిండి, 64,494 టన్నుల చక్కెర, 21,513 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 35,749 టన్నుల ఉల్లిపాయలు మరియు 427.5 మిలియన్ గుడ్లను ఎగుమతి చేయడానికి భారత్ అనుమతించింది. దీంతో పాటు 1 మిలియన్ టన్నుల కంకర రాయి, నది ఇసుకను ఎగుమతి చేసేందుకు కూడా అనుమతించింది.
