US tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే, అమెరికా విధించిన సుంకాలను పట్టించుకునే పరిస్థితి లేదని, భారతదేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఎగుమతులు, దేశ జీడీపీపై తక్కువ ప్రభావం ఉంటుందని, భారతదేశంలో వ్యవసాయం, పాడిపరిశ్రం, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSMEలు) వంటి కీలక రంగాలు రక్షించబడతాయని విషయం తెలిసిన అధికారి తెలిపారు.
ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని, అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని సదరు అధికారి వెల్లడించారు. ‘‘25 శాతం సుంకాలు స్వల్ప ప్రభావం చూపవచ్చు. కానీ ఈ ప్రభావం భారత మార్కెట్లపై అస్సలు ఆందోళనకరమైంది కాదు’’ అని తెలిపారు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో భారత దేశ జీడీపీలో 0.2 శాతం కంటే తక్కువ నష్టానికి దారి తీయవచ్చు, దీనిని మెయింటెన్ చేయవచ్చు అని చెప్పారు.
Read Also: Chiranjeevi Birthday: ‘మెగా’ బ్లాస్టింగ్ లోడింగ్.. చిరంజీవి బర్త్ డేకి అదిరిపోయే అప్డేట్స్!
దేశ ప్రయోజనాలే అతిముఖ్యమైనవని, జన్యుపరంగా మార్పిడి చేసిన (GM) పంటల దిగుమతిని అనుమతించే ప్రశ్నే లేదని, దేశ వ్యవసాయం, పాడి పరిశ్రమలను దెబ్బతీసే ఏ నిబంధనలకు అంగీకరించేది లేదని భారత్ స్పష్టంగా చెబుతోంది. మాంసాహార పాలు, గొడ్డు మాంసం ఉత్పత్తులతో సహా మతపరమైన సున్నితత్వాలకు సంబంధించిన విషయాలపై ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్రం స్పష్టంగా చెబుతోంది.
ఈ టారిఫ్స్ వల్ల అత్యధిక ఎగుమతులు ప్రభావితం కావని, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే చాలా వస్తువులు కూడా ఈ కొత్త సుంకాల పరిధిలోకి రావని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఎగుమతులు కొద్దిగా తగ్గవచ్చని, కానీ అమెరికాకు వెళ్లే భారత వస్తువుల్లో ఎక్కువ భాగం సుంకాలకు వెలుపల ఉంటాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం, ప్రభుత్వం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) కోసం చర్చలు జరుపుతోందని అధికారులు చెబుతున్నారు.