NTV Telugu Site icon

Indian Economy: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్.. యూఎన్ రిపోర్ట్‌లో వెల్లడి..

Indian Economy

Indian Economy

UN Economic Report: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక నివేదిక వెల్లడించింది. 2024లో కూడా భారత వృద్ధి 6.2 శాతానికి చేరుకోగలదని యూఎన్ ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక తెలిపింది. భారత వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని, అయితే ఇది 2023లోని 6.3 శాతంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని యూఎన్ రిపోర్ట్ అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధికి దేశీయ డిమాండ్, తయారీ, సేవల రంగాల్లో బలమైన వృద్ధి తోడ్పడుతుందని నివేదిక పేర్కొంది.

స్థిరాస్తి రంగంలో చైనా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, అయినప్పటికీ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను భర్తీ చేస్తాయని తెలిపింది. చైనాకు పరిస్థితికి విరుద్ధంగా భారత్ లో ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మల్టీ నేషనల్ పెట్టుబడుల వల్ల బలమైన పనితీరును నమోదు చేస్తుందని తెలిపింది. 2023 మూడో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సంబంధించి ముఖ్యమైన కొలమానంగా భావించే మాన్యుఫాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ భారతదేశంలో మెరుగ్గా ఉందని, అయితే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మాత్రం ఈ ఇండెక్స్ సంకోచంలో ఉందని పేర్కొంది.

Read Also: Malavika Mohanan: మాళవిక మోహన్ కు చేదు అనుభవం.. అక్కడ అలా జరగడంతోనే..

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కన్నా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడులు మెరుగ్గా ఉన్నట్లు యూఎన్ నివేదిక తెలిపింది. దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశంలో 2023లో పెట్టుబడులు బలంగా ఉన్నాయని, సప్లై చైన్‌లో వైవిధ్యం కోసం పలు కంపెనీలు భారతదేశాన్ని స్థావరంగా భావిస్తున్నాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతుందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇన్‌కమ్ షేర్స్ 10 శాతం పెరిగాయని, దక్షిణాఫ్రికా, భారత్ వంటి దేశాల్లో కాపిటల్ ఇన్‌ఫ్లో పెరిగినట్లు తెలిపింది.

2023లో దక్షిణాసియా ప్రాంతంలో వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపించాయని నివేదిక పేర్కొంది. జూలై, ఆగస్టు నెలల్లో కరువు, వర్షాభావ పరిస్థితులు తీవ్రమయ్యాయని, ఇవి నేపాల్, భారత్, బంగ్లాదేశ్ ప్రాంతాలపై ప్రభావం చూపాయని తెలిపింది. 2023 ఆగస్టు నెల భారత్‌లో 4 దశాబ్ధాల తర్వాత అత్యంత పొడి నెలగా మారిందని, ఇది ప్రధాన పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని తెలిపింది. దీర్ఘకాలిక అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచ జీడీపీ వృద్ధి 2023లో 2.7 నుంచి 2024లో 2.4 శాతానికి తగ్గుతుందని, 2025లో వృద్ధి 2.7 శాతానికి మధ్యస్థంగా మెరుగుపడుతుందని నివేదిక అంచనా వేసింది.