భారత్-పాకిస్థాన్ యుద్ధం విరమణ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని భారతదేశం మరోసారి తేల్చి చెప్పింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్‌తో పాటు చైనా కూడా కృషి చేసిందని వ్యాఖ్యానించారు.
తాజాగా చైనా ప్రకటనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. పాక్‌తో కాల్పుల విరమణ విషయంలో ఎవరి జోక్యం లేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల సైనిక డీజీఎంవోలు చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారని.. ఇందులో మూడో పక్షం పాత్ర లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై ఇప్పటికే పలు సందర్భాల్లో తమ వైఖరిని స్పష్టం చేసినట్లు పేర్కొంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం మే 7న ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల తర్వాత మే 10న ఇరు దేశాల చర్చలతో కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ క్రెడిట్‌ను ట్రంప్ కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇరు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో బెదిరించడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. అయితే ట్రంప్ వాదనను భారతదేశం తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. అయినా కూడా ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కడికెళ్లినా.. ఏ నేతతో భేటీ అయినా ప్రపంచ వ్యాప్తంగా భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాటు ఎనిమిది యుద్ధాలు ఆపినట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకోవైపు భారత్ నిరంతరం ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇలా ఇప్పటి వరకు 70 సార్లు ఆ విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు.
తాజాగా ఈ జాబితాలో చైనా కూడా చేరింది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్‌తో పాటు చైనా కూడా కృషి చేసిందని మంగళవారం విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రకటించారు. భారత్-పాకిస్థాన్‌తో పాటు ఉత్తర మయన్మార్ ఉద్రిక్తతలు, కంబోడియా-థాయ్‌లాండ్, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలు, ఇరాన్ అణు సమస్యతో పాటు ప్రపంచ సంఘర్షణలకు బీజింగ్ శాంతికర్తగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ఇక ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు తర్వాత భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మొత్తానికి చైనా వాదనను భారత్ తోసిపుచ్చింది.
