India Rafale Jets: భారత వైమానిక దళం (IAF) వద్ద ఉన్న రఫేల్ యుద్ధ విమానాల సంఖ్యపై మరోసారి వివాదం చెలరేగింది. భారత్ ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయగా, ప్రస్తుతం వాటిలో 32 మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయని బ్రిటిష్ ఏవియేషన్ మ్యాగజైన్ ఫ్లైట్ గ్లోబల్ తన తాజా ‘‘వరల్డ్ ఎయిర్ ఫోర్సెస్ డైరెక్టరీ’’లో పేర్కొంది. అయితే, ఈ నివేదికపై మాజీ ఐఏఎఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన విధుల్లో ఉన్నారు. ఈయన ఈ నివేదికను కొట్టిపారేశారు. స్పష్టమైన అబద్ధాలుగా పేర్కొన్నారు.
రఫేల్ కూలిపోయాయని ప్రచారం..
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా, పాకిస్తాన్ అనుకూల సంస్థలు, వ్యక్తులు రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని ప్రచారం చేశాయి. భారత్‌లోని ప్రతిపక్షాలు కూడా భారత్ జెట్లు కూలిపోయాయని ఆరోపించారు. తాజాగా ఫ్లైట్‌గ్లోబర్ నివేదిక పూర్తిగా పాకిస్తాన్ అనుకూల వైమానిక రంగ రచయిత అలన్ వార్న్స్ అందించిన సమాచారం ఆధారంగా రూపొందించింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తమకు అనుకూల కథనాల కోసం వార్న్స్‌కు 34,000 బ్రిటిష్ పౌండ్లు చెల్లించిందనే ఆరోపణలు ఉన్నాయి.
గతేడాది ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు చెందిన నాలుగు రఫేల్ జెట్లను పాకిస్తాన్ కూల్చేసిందని చెప్పాడు. అయితే, 2026 రిపబ్లిక్ డే సమయంలో రఫేల్ యుద్ద విమానాల విన్యాసంతో ఈ ప్రచారానికి తెరపడింది.
పాక్ ప్రచారం..
ఈ నివేదికను ఆధారంగా చేసుకుని పాకిస్తాన్ తన అనుకూల ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధారాలు చూపించడంలో విఫలమవుతున్న పాకిస్తాన్, అక్కడి మీడియా ద్వారా ఈ నివేదికను ముందు పెట్టుకుని పాకిస్తాన్ భారత్‌కు చెందిన రఫెల్ జెట్లను కూల్చేసిందని, దీనికి ఈ నివేదికే ఆధారం అని ప్రచారం చేస్తోంది.
పాక్ స్వయంగా కూల్చినట్లు చెబుతున్న జెట్ల సంఖ్య కూడా తప్పుగా చెబుతోంది. పలు సందర్భాల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒకసారి మూడు, మరోసారి నాలుగు, ఆరు విమానాలు అంటూ ప్రస్తావించాడు. రఫేల్ కూల్చినట్లు పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క శకలం ఫోటో కానీ, ఉపగ్రహ చిత్రాలను కాని బయటపెట్టలేదు. చైనా కూడా ఇలాంటి ప్రచారమే చేసింది. కానీ ఆధారాలు చూపించలేదు.
మరో 114 రఫేల్ కొనుగోలుకు భారత్ ప్లాన్..
ఇదిలా ఉంటే, ఫ్రాన్స్ నుంచి మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి భారత్ ప్లాన్ చేస్తోంది. భారత్ నేవీ కోసం 26 యుద్ధ విమానాల కోసం ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరింది.

