NTV Telugu Site icon

Mpox: “ఎంపాక్స్‌”‌ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం.. ఆస్పత్రి, ఎయిర్‌పోర్టుల్లో అలర్ట్..

Mpox

Mpox

Mpox: కరోనా మహమ్మారి తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే కొత్త ముప్పు ‘‘ఎంపాక్స్’’ రూపంలో ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే మంకీపాక్స్‌ని ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి వైరస్ మూలంగా ఇప్పటికే 500 మందికి పైగా మరణించారు. ఆ దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే స్వీడన్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఎంపాక్స్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటుతో పాటు విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించడంతో సహా ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని ప్రభుత్వం ఆస్పత్రిని ఆదేశించింది.

Read Also: Tragedy: రాఖీ పండగ వేళ విషాదం.. అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి దుర్మరణం

ఢిల్లీలోని మూడు నోడల్ ఆస్పత్రులు-సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ మరియు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ప్రకటించారు. అనుమానిత రోగులపై RT-PCRతో పాటు నాజిల్ స్వాబ్ పరీక్షలు చేయనున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విమానాశ్రయాలనను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

రెండేళ్ల క్రితం 100కి పైగా దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ ఆ తర్వాత విరమించుకుంది. తాజాగా ఈ ఏడాది మరోసారి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. జూన్ 2022 నుంచి మే 2023 వరకు భారత్‌లో కూడా 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యయాయి. ప్రస్తుతం ఎంపాక్స్ వైరస్ గతంలో కన్నా శక్తివంతంగా మారినట్లు వైద్యులు చెబుతున్నారు. లైంగిక సంపర్కంతో సహా సాధారణ సాన్నిహిత్యం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.