Site icon NTV Telugu

India-Maldives row: మాల్దీవులతో వ్యాపారం మానుకోండి.. వ్యాపార సంఘం CAIT పిలుపు..

India Maldives Row

India Maldives Row

India-Maldives row: భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో భారత వ్యాపార సంఘమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) మాల్దీవులతో వ్యాపారం చేయడం మానుకోవాలని కోరింది. ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం లేదని వ్యాపార వర్గాలు అన్నాయి. మాల్దీవుల చర్యలకు వ్యతిరేకంగా ఈ బహిష్కరణకు పిలుపునిచ్చింది.

ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి మాల్దీవుల్లో వణుకు మొదలైంది. అక్కడి మంత్రులు మల్హ షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మజిద్ ప్రధానిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వివాదాస్పదమైంది. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Read Also: India-Maldives Row: తాగు నీరు, కోవిడ్, తిరుగుబాట్ల అణిచివేతలో భారత్ సాయం.. అయినా, చైనా రాగం ఎత్తుకుంటున్న మాల్దీవ్స్..

ఈ నేపథ్యంలో భారత్‌లోని వ్యాపారులు, ఎగుమతిదారులు మాల్దీవులతో వ్యాపారానికి దూరంగా ఉండాలని CAIT సోమవారం కోరింది. ఈ సంస్థ జాతీయాధ్యక్షుడు బీసీ భార్టియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్ వాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వ్యాపారానికి ఆమోదయోగ్యం లేవని, వారి అగౌర ప్రవర్తనకు వ్యతిరేకంగా అసమ్మతి తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ‘‘అంతర్జాతీయ సంబంధాలు పరస్పర గౌరవం మరియు సహకారంపై ఆధారపడి ఉండాలి, అయితే రాజకీయ నాయకులను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయి. అవమానకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు క్షమాపణలు చెప్పాలి’’ అని ఖండేల్వాల్, భార్టియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version