NTV Telugu Site icon

PM Modi: ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిది..

Pm Modi

Pm Modi

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, దేశ ప్రజలందరూ తమ విధులను దేశ హక్కులతో సమానంగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కోరారు.ఇవాళ పాట్నాలో జరిగిన బిహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బిహార్ విధానసభకు 100 సంవత్సరాల స్మారకార్థం నిర్మించిన శతాబ్ది స్మృతి స్తంభాన్ని ఆయన ప్రారంభించారు. విధానసభ మ్యూజియంకు ఆయన శంకుస్థాపన చేశారు. మ్యూజియంలోని వివిధ గ్యాలరీలు బిహార్‌లో ప్రజాస్వామ్య చరిత్రను ప్రదర్శిస్తాయి. ఇందులో 250 మంది కంటే ఎక్కువగా కూర్చునే సామర్థ్యం కలిగిన కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా విధానసభ అతిథి గృహానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బిహార్ విధానసభ కాంప్లెక్స్‌ను సందర్శించిన మొదటి ప్రధానిగా తాను ఘనత పొందినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. బిహార్ ప్రజల అభిమానానికి నమస్కరిస్తున్నానన్నారు. శతాబ్ది స్మృతి స్తంభం బిహార్ అనేక ఆకాంక్షలను గుర్తు చేస్తుందన్నారు.

బిహార్ అసెంబ్లీ యొక్క అద్భుతమైన చరిత్రను గుర్తుచేసుకున్న ప్రధాన మంత్రి.. ఇక్కడ విధానసభ భవనంలో ఒకదాని తర్వాత ఒకటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలని, స్వదేశీ చరఖాను స్వీకరించాలని గవర్నర్ సత్యేంద్ర ప్రసన్న సిన్హా ఈ సభ నుండి విజ్ఞప్తి చేశారని ప్రధాని మోదీ తెలిపారు. “స్వాతంత్ర్యం తర్వాత జమీందారీ నిర్మూలన చట్టం ఈ అసెంబ్లీలో ఆమోదించబడింది. ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్లి నితీష్ ప్రభుత్వం బిహార్ పంచాయతీరాజ్ వంటి చట్టాన్ని ఆమోదించింది. పంచాయితీలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రంగా బిహార్‌ను మార్చింది” అని ఆయన గుర్తు చేసుకున్నారు.

Viral News: సీఎంకు చల్లారిన టీ.. అధికారికి షోకాజ్ నోటీసులు

ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ అని ప్రధాని పునరుద్ఘాటించారు. బిహార్ వైభవాన్ని ఎవరూ చెరిపివేయలేరన్నారు.ఈ అసెంబ్లీ భవనం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. బ్రిటీష‌ర్ల‌కు వ్య‌తిరేకంగా శ్రీ‌బాబు స్వ‌తంత్ర ప‌రిపాల‌న‌ను ప్ర‌క‌టించిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. బిహార్ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి నిబద్ధతలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉందన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రూపంలో బిహార్ స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిని ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌, కర్పూరీ ఠాకూర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ లాంటి నాయకులు ఈ నేల నుంచే వచ్చారని ప్రధాని తెలిపారు. దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం జరిగినప్పుడు కూడా బిహార్ తెరపైకి వచ్చి దానికి వ్యతిరేకంగా నిలబడిందన్నారు. బిహార్ ఎంత సంపన్నంగా ఉంటే, భారత ప్రజాస్వామ్యం అంత శక్తివంతంగా ఉంటుందని ప్రధాని అన్నారు. బిహార్ బలంగా ఉంటే భారతదేశం మరింత సమర్థంగా ఉంటుందని ప్రధాన మంత్రి సూచించారు.