India-China: అమెరికాతో సుంకాలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా, చైనా బిజినెస్ వీసాల ప్రక్రియ వేగాన్ని పెంచింది. చైనా ఎగ్జిక్యూటివ్‌లకు బిజినెస్ వీసాలు సమయాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటోంది. పరిపాలన తనిఖీలు తగ్గించడం ద్వారా, భారత్ ఒక నెల రోజుల్లోనే చైనా సంస్థలకు బిజినెస్ వీసాలను జారీ చేయాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. సాధారణ ప్రయోజనాల దృష్ట్యా ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి భారత్ నుంచి వస్తున్న సానుకూల చర్యల్ని గమనిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సులభతర మార్పిడిని పెంచడానికి భారత్‌తో నిరంతరం సంప్రదింపులు నిర్వహించడానికి చైనా సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు.
2020లో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడం, గల్వాన్ ఘర్షణ వల్ల భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గల్వాన్ నదిలోయలో పాంగాంగ్ సరస్సు సమీపంలో భారత్ నిర్మిస్తున్న రహదారిని అడ్డుకునేందుకు చైనా సైనికులు దూకుడుగా వ్యవహరించడంతో గల్వాన్ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో 20 మందికి పైగా భారతీయులు మరణించారు. ఆ తర్వాత భారత సైనికులు జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో చైనా సైనికులు మరణించినట్లు వెస్ట్రన్ మీడియా వెల్లడించింది. అయితే, చైనా తన మరణాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించింది లేదు. 1975 తర్వాత సరిహద్దుల్లో గల్వాన్ ఘర్షణ మొదటిది.
Read Also: CM Chandrababu Delhi visit: మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
అయితే, మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో.. చైనా, భారత్ ఎల్ఏసీ వెంట ఉన్న కార్ప్స్ కమాండర్ల మధ్య చర్చలు ప్రారంభించాయి. దౌత్య, సైనిక చర్చల ద్వారా సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. 2024లో పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒప్పందంతో, డిసెంబర్ 2024 నాటికి డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో సైనికులు వైదొలిగారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు నార్మల్ కావడం ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉంటే, అమెరికా తీరు భారత్-చైనా సంబంధాలు మరింత బలపడేందుకు సాయపడుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 50 శాతం సుంకాలను విధించడంతో, భారత్ తన ఉత్పత్తుల కోసం వేరే మార్కెట్ల కోసం చూస్తోంది. ఇది చైనా వైపు భారత్ చూసేందుకు సహాయపడింది. ప్రస్తుతం, భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం బలంగా ఉంది, కానీ రెండు దేశాల మధ్య అసమతుల్యత ఉంది. రెండు దేశాల మద్య 2025 ఆర్థిక సంవత్సరంలో 127.7 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. అమెరికా తర్వాత, చైనాకు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. FY26 ప్రారంభంలో (ఏప్రిల్-జూలై 2025) భారత ఎగుమతులు 19.97% పెరిగి 5.75 బిలియన్ డాలర్లుగా ఉంటే, దిగుమతులు 40.65 బిలియన్ డాలర్లు ఉంది.
