Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!

  • రక్షణ శాఖ బలోపేతం దిశగా కేంద్రం అడుగులు
  • సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు
  • ఖర్చులు వెల్లడించిన రక్షణ మంత్రిత్వ శాఖ
Defencespendingpowers

Defencespendingpowers

భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం అడుగులు వేసింది. ఇందులో భాగంగా సాయుధ దళాల కొనుగోలు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ దళాల ఉన్నతాధికారులు, సర్వీస్ చీఫ్‌ల ఆర్థిక అధికారాలను గణనీయంగా పెంచుతూ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని ద్వారా రూ.1.25 లక్షల కోట్లకు పైగా విలువైన రక్షణ కొనుగోళ్లను వేగంగా పూర్తి చేసే అవకాశం కలుగనుంది.

ఎంత పెరిగాయి?


2021లో అమల్లోకి వచ్చిన నిబంధనలతో పోలిస్తే కొత్త వ్యవస్థలో ఆర్థిక అధికారాలను 100 శాతం వరకు.. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా పెంచారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యాలను తగ్గించి సైనిక సన్నద్ధతను పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

×
×
Ad

ఆర్మీ కమాండర్లకు ఎంత అధికారం?


ఆర్మీ కమాండర్లు, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో సమాన హోదా కలిగిన అధికారుల ఆర్థిక అధికారాన్ని రూ.30 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచారు. ఇక ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ చీఫ్‌ల ఆర్థిక అధికారాన్ని రూ.75 కోట్ల నుంచి రూ.125 కోట్లకు పెంచారు. సరిహద్దు భద్రత, అత్యవసర సైనిక అవసరాల కోసం కమాండర్లకు ఉన్న ప్రత్యేక ఆర్థిక అధికారాలను కూడా భారీగా పెంచారు. మొత్తం పరిమితిని దాదాపు రెట్టింపు చేశారు.

స్వదేశీ రక్షణ తయారీకి ఊతం


‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ రక్షణ పరికరాల కొనుగోలు, పరిశోధన-అభివృద్ధి (R&D) ప్రాజెక్టుల కోసం ఉన్న ఆర్థిక అధికారాలను రెట్టింపు చేశారు. దీంతో దేశీయ తయారీ సంస్థలకు మరింత అవకాశాలు లభించే అవకాశం ఉంది. కొత్త విధానం ద్వారా రక్షణ రంగంలోని పరిశోధన, సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ఆర్థిక స్వేచ్ఛ లభించనుంది. దీంతో స్వదేశీ సాంకేతికతలను వేగంగా సైన్యంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తరఫున ఒకే విభాగం చేపట్టే ఉమ్మడి కొనుగోళ్లకు కూడా అధిక ఖర్చు పరిమితులు కల్పించారు. దీంతో మూడు దళాల మధ్య సమన్వయం, సామర్థ్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త ఆర్థిక అధికారుల నియామకం


కొనుగోలు ప్రక్రియను వికేంద్రీకరించేందుకు పలు కొత్త ‘కాంపిటెంట్ ఫైనాన్షియల్ అథారిటీ’ (CFA) హోదాలను కూడా సృష్టించారు. దీని వల్ల నిర్ణయాలు మరింత వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. 2021 తర్వాత సాయుధ దళాల విస్తరణ, పెరిగిన నిర్వహణ ఖర్చులు, రక్షణ బడ్జెట్‌లో పెరుగుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణలు చేపట్టినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల రక్షణ కొనుగోళ్లకు పట్టే సమయం తగ్గుతుంది. కీలక ఆయుధాలు, పరికరాలు, వనరులు వేగంగా అందుబాటులోకి రావడంతో పాటు సైనిక సన్నద్ధత, ప్రాజెక్టుల అమలు సామర్థ్యం మరింత మెరుగుపడనుంది.