Site icon NTV Telugu

India-China border clash: అరుణాచల్ ప్రదేశ్ ఘర్షణపై స్పందించిన చైనా..

China

China

India-China border clash, China’s response: అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్ఏసీ వెంబడి భారత్, చైనా దళాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై తొలిసారిగా చైనా స్పందించింది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9 అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. అయితే సరిహద్దు సమస్యను దౌత్యం, సైనిక మార్గాల ద్వారా ఇరు దేశాలు సంప్రదింపులు కొనసాగించాలని ఆయన అన్నారు.

Read Also: Rishi Sunak: రిషి సునాక్‌కి ఊహించని షాక్.. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత

డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్, చైనా సైనికులకు గాయాలు అయినట్లు వెల్లడించింది. తవాంగ్ సెక్టార్ లో 200 మందికి పైగా చైనా సైనికులు కర్రలతో భారత సైనికులపై దాడికి ప్రయత్నించారు. ఈ దాడిని భారత సైనికులు తిప్పికొట్టారు. గతంలో గాల్వాన్ లోయ ఘర్షణల అనంతరం 30 నెలల తర్వాత మళ్లీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఈ ఘర్షణల అనంతరం రెండు వైపుల బలగాలు ఆ ప్రాంతం నుంచి వైదొలిగాయి. ఇరు దేశాల మధ్య కమాండర్ స్థాయిలో శాంతి కోసం ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. ఈ ఘర్షణలపై భారత్ ఘాటుగానే స్పందించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో భారతదేశం-చైనా సరిహద్దు ఘర్షణ సమస్యను ప్రస్తావించారు. యథాతథ స్థితిని మార్చేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నించిందని.. అయితే భారత బలగాలు వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని ఆయన పార్లమెంట్ లో ప్రకటించారు. ఈ ఘర్షణల్లో భారత సైనికులకు ఎలాంటి తీవ్ర గాయాలు, ప్రాణనష్టం కలగలేదని ఆయన వెల్లడించారు. మరోవైపు, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఎవరూ ఒక్క అంగుళం భూమిని కబ్జా చేయలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

Exit mobile version