India-China border clash, China’s response: అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్ఏసీ వెంబడి భారత్, చైనా దళాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై తొలిసారిగా చైనా స్పందించింది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9 అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. అయితే సరిహద్దు సమస్యను దౌత్యం, సైనిక మార్గాల ద్వారా ఇరు దేశాలు సంప్రదింపులు కొనసాగించాలని ఆయన అన్నారు.
Read Also: Rishi Sunak: రిషి సునాక్‌కి ఊహించని షాక్.. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత
డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్, చైనా సైనికులకు గాయాలు అయినట్లు వెల్లడించింది. తవాంగ్ సెక్టార్ లో 200 మందికి పైగా చైనా సైనికులు కర్రలతో భారత సైనికులపై దాడికి ప్రయత్నించారు. ఈ దాడిని భారత సైనికులు తిప్పికొట్టారు. గతంలో గాల్వాన్ లోయ ఘర్షణల అనంతరం 30 నెలల తర్వాత మళ్లీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ ఘర్షణల అనంతరం రెండు వైపుల బలగాలు ఆ ప్రాంతం నుంచి వైదొలిగాయి. ఇరు దేశాల మధ్య కమాండర్ స్థాయిలో శాంతి కోసం ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. ఈ ఘర్షణలపై భారత్ ఘాటుగానే స్పందించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో భారతదేశం-చైనా సరిహద్దు ఘర్షణ సమస్యను ప్రస్తావించారు. యథాతథ స్థితిని మార్చేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నించిందని.. అయితే భారత బలగాలు వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని ఆయన పార్లమెంట్ లో ప్రకటించారు. ఈ ఘర్షణల్లో భారత సైనికులకు ఎలాంటి తీవ్ర గాయాలు, ప్రాణనష్టం కలగలేదని ఆయన వెల్లడించారు. మరోవైపు, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఎవరూ ఒక్క అంగుళం భూమిని కబ్జా చేయలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.