Dawood Ibrahim: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషయంలో ఐక్యరాజ్యసమితి (UN) ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ నివేదికలో వాస్తవానికి విరుద్ధమైన లోపాలు ఉన్నాయని భారత్ అభ్యంతరం తెలిపింది. UNలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ రఘు పూరి ఈ అంశంపై స్పందిస్తూ.. దావూద్ 2003లో UN జాబితాలో చేర్చడానికి ముందే భారత్ విడిచివెళ్లాడని, 1993 ముంబై వరస పేలుళ్ల నుంచి అతను భారత దర్యాప్తు సంస్థలకు మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. దావూద్ ఇబ్రహీం 1993 ముంబై వరస బ్లాస్ట్‌ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అతడిని అప్పగించాలని పాకిస్తాన్‌ను భారత్ కోరుతోంది. అయితే, దావూద్ తమ దేశంలో లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది.
దావూద్‌కు అల్‌ఖైదా, ఒసామా బిన్ లాడెన్‌తో సంబంధాలు ఉన్నాయనే కారణంతో 2003లో UN జాబితాలో చేర్చిన అంశాన్ని నివేదిక ప్రస్తావించిన తీరు తప్పుదారి పట్టించేదిలా ఉందని ఆయన అన్నారు. దావూద్ 2003లో ఐరాస జాబితాలో చేర్చడానికి ముందే భారత్ నుంచి పారిపోయాడని చెప్పారు. అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పట్టుబడిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడని పూరి వెల్లడించారు. పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బిన్ లాడెన్ 2011లో పాకిస్తాన్‌లోని అబొట్టాబాద్‌లో అమెరికా నేవీ సీల్స్ చేపట్టిన ఆపరేషన్‌లో హతమయ్యాడు.
బెన్ సాల్ నివేదికలో వాస్తవపరమైన లోపాలున్నాయని, సభ్య దేశాల ముందు కొన్ని అంశాలను ముందే నిర్ణయించినట్లుగా ఉంచారని రఘు పూరి విమర్శించారు. ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ తన నివేదికలో దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని D-కంపెనీని “ఇండియా నుంచి పనిచేస్తున్న క్రిమినల్ గ్యాంగ్”గా పేర్కొనడంతో వివాదం మొదలైంది. నివేదికలో పక్షపాతం కనిపిస్తోందని ఆరోపించారు. మానవ హక్కుల వ్యవస్థ ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఉపయోగించూడదని పూరి హితవు పలికారు.
మరోవైపు, పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్, లడఖ్, అంశాలపై పాక్ చేస్తున్న వ్యాఖ్యలను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారంగా రఘుపూరి అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ భారత్‌లో అంతర్భాగమని, అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని స్పష్టం చేశారు.

