India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్‌ లుక్ విడుదల.. ఫొటో వైరల్

  • భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్‌ లుక్ విడుదల
  • రైల్వే మంత్రిత్వ శాఖలో బుల్లెట్ ట్రైన్ చిత్రం
  • సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Indiabullettrain2

Indiabullettrain2

భారతీయులు ఎప్పుడెప్పడా అంటూ ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడవనున్న దేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ డిజైన్‌ను రైల్వే శాఖ ఆవిష్కరించింది. దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖలో బుల్లెట్ ట్రైన్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేట్ నెంబర్ 4 దగ్గర ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది.

జపాన్ సహకారంతో రూపొందుతున్న ఈ బుల్లెట్ ట్రైన్ భారతీయ రైల్వే రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ రైలు గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం భారీగా తగ్గిపోనుంది. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇక ఫస్ట్ లుక్‌లో బుల్లెట్ ట్రైన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో కనిపించింది. ఏరోడైనమిక్ ఆకృతితో రూపొందించిన ఈ రైలు ఆధునిక భారత రైల్వే అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర రైల్వే శాఖ పేర్కొంది. భారత్‌లో బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభమైతే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.