ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై శనివారం ఇండియా కూటమి న్యూఢిల్లీలో ‘‘ప్రజా అభిశంసన’’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 21 ప్రతిపక్ష పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ‘‘మాక్-అభిశంసన’’ కార్యక్రమం జరగనునంది. నిజానికి ఈ కార్యక్రమం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే, ఢిల్లీలో భారీ వర్షం కారణంగా శనివారానికి వాయిదా వేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, వామపక్ష పార్టీలు పాల్గొననున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు సామాజిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్పెషల్ ఇంటెన్సివ్ (SIR)ను వ్యతిరేకించేవారు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. ఆమె యూపీఏ ప్రభుత్వం సమయంలో 2009 నుంచి 2014 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.
ఈ డమ్మీ-అభిశంసన కార్యక్రమం ఎలా జరగనుంది.?
ఈ కార్యక్రమాన్ని పార్లమెంటరీ విధానాన్ని అనుసరించి నిర్వహించబోతున్నారు. మీరా కుమార్ సభకు అధ్యక్షత వహిస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు తమకు కేటాయించిన సమయానికి అనుగునంగా తీర్మానంపై మాట్లాడుతారు. చివరగా రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు గురువారం ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల మీటింగ్ జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, మీరా కుమార్, సీపీఎం నేత జాన్ బ్రిటాస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రియన్, సమాజ్‌వాదీ పార్టీ నేత హరేంద్ర మాలిక్, జేఎంఎం నేత మహువా మాజి తదితరులు హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని అశోక హోటల్‌లో నిర్వహించాలని భావించారు, ఆ తర్వాత జంతర్ మంతర్‌లో నిర్వహించాలని అనుకున్నారు. అనుమతులు రాకపోవడంతో చివరకు ఖర్గే నివాసంలో అభిశంసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రాహుల్, అఖిలేష్‌కు అమిత్ షా సవాల్..
ఇదిలా ఉంటే, మాక్ అభిశంసన కార్యక్రమానికి ఒక రోజు ముందు అమిత్ షా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లకు సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు చేస్తున్న ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలపై పార్లమెంట్‌లో చర్చలకు రావాలని కోరారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని, చర్చకు రావడానికి మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కష్టపడి సాధన చేయకుండా అంపైర్‌ను నిందించే క్రికెట్ జట్టుతో రాహుల్, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ’’ అని ఎద్దేవా చేశారు.

