ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక నామినేషన్‌కు రెండు రోజులే గడువు ఉంది. గురువారంతో నామినేషన్ గడువు ముగుస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించేసింది. తమిళనాడు ప్రాంత వాసి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇది కూడా చదవండి: Trump-Zelensky: వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్
మంగళవారం మధ్యాహ్నం ఇండియా కూటమి నేతలంతా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ కూటమి ప్రకటించగా.. ఇండియా కూటమి కూడా తమిళనాడు వాసినే ప్రకటించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే డీఎంకే నేత, రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శివ కాకపోతే రాజకీయాలకు సంబంధం లేని శాస్త్రవేత్త పేరును డీఎంకే ప్రతిపాదించింది. వీళ్లిద్దరిలో ఎవరినొకరిని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Archana Tiwari: లా గ్రాడ్యుయేట్ అర్చన తివారీ అదృశ్యం.. 3 బృందాలు గాలింపు
తమిళ వ్యక్తినే పోటీకి పెట్టాలని డీఎంకే పట్టుబడుతుంది. డీఎంకే డిమాండ్‌కు కాంగ్రెస్ కూడా మొగ్గుచూపుతోంది. అయితే రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తినే ఎంపిక చేస్తే బాగుంటుందని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో ఒక శాస్త్రవేత్త పేరును డీఎంకే సూచించినట్లు సమాచారం.
వాస్తవానికి సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఎన్డీఏ కూటమినే ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకుంటుంది. అయినా కూడా తమ ఐక్యతను చాటిచెప్పాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని నిలబెడుతోంది. ప్రస్తుతం మొత్తం ఉభయ సభల సభ్యుల సంఖ్య 782గా ఉంది. సింపుల్ మెజారిటీతో 392 ఓట్లు వచ్చిన అభ్యర్థే గెలుపొందుతారు. ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమి బలం 422గా ఉంది. లోక్‌సభలో 293 ఎన్డీఏ కూటమి పక్షాల సభ్యులు, రాజ్యసభలో 129 మంది ఉన్నారు.
ఇది కూడా చదవండి: Trump: పుతిన్-జెలెన్‌స్కీ భేటీపై ట్రంప్ కీలక ప్రకటన
ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. అయితే ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రాజ్‌నాథ్‌సింగ్ ఇండియా కూటమిని సంప్రదించగా.. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయమని తేల్చి చెప్పినట్లు సమాచారం.
