NTV Telugu Site icon

Domestic Airline Market: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించిన ఇండియా..

India Aviation Market

India Aviation Market

Domestic Airline Market: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ఈ దశాబ్ధం చివరి నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు భారత విమానయాన రంగం కూడా గత దశాబ్ధకాలంలో బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించింది. 10 ఏళ్ల క్రితం 5వ స్థానంలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది.

10 ఏళ్ల క్రితం భారత్ దాదాపుగా 8 మిలియన్ల సీట్లతో 5వ డొమెస్టిక్ ఎయిర్ లైన్ మార్కెట్‌గా ఉండేది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉండేవి. అమెరికా, చైనాలు వరసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించింది. బ్రెజిల్, ఇండోనేషియాలను అధిగమించి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ సీట్ల ఎయిర్‌లైన్ సామర్థ్యంలో మూడో స్థానానికి చేరినట్లు OAG డేటా తెలిపింది.

Read Also: Vedhika: వేయడానికి 3 గంటలు.. తీయడానికి 2 గంటలు.. ‘యక్షిణి’ కష్టాలు బయటపెట్టిన వేదిక

10 ఏళ్ల సగటు కన్నా భారత్ సీటింగ్ సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. ఇది ఏటా 6.9 శాతం పెరుగుతోంది. ప్రస్తుతం 5 దేశీయ మార్కెట్లలో భారత వృద్ధి రేటు అత్యంత వేగంగా సాగుతోందని నివేదిక తెలిపింది. 2014-2024 మధ్య 6.3 శాతం వార్షిక వృద్ధితో చైనా వెనకబడి ఉందని, యూఎస్ఏ, ఇండోనేషియాలో కూడా చాలా తక్కువ వృద్ధి రేటు ఉందని నివేదిక తెలిపింది. OAG రిపోర్టు ప్రకారం.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే లో-కాస్ట్ క్యారియర్(LCC) కెపాసిటీ షేర్. ఏప్రిల్ 2024లో LCC భారత్‌లో దేశీయ ఎయిర్‌లైన్ సామర్థ్యం 78.4 శాతం వాటాను కలిగి ఉంది. తొలి 5 దేశాల డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్లో భారత్‌దే అత్యధిక LCC వాటా కలిగి ఉంది.

గత 10 సంవత్సరాలలో, ఇండిగో వారి మార్కెట్ వాటాను దాదాపు రెట్టింపు చేసిందని, 2014లో 32 శాతం సామర్థ్యం నుండి నేడు 62 శాతానికి పెరిగిందని రిపోర్ట్ తెలిపింది. మిగిలిన మార్కెట్ కేవలం 0.7 శాతం మాత్రమే వృద్ధి చెందింది, అయితే ఇండిగోలో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని వెల్లడించింది. గతేడాది నవంబర్ 19న ఒక్క రోజే భారత్‌లో విమానయాన సంస్థలు 4,56,910 మంది దేశీయ ప్రయాణికులతో ప్రయాణించాయి. కోవిడ్ తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే ఎయిర్ ట్రాఫిక్. ఇది కోవడ్ ముందు సగటు కన్నా 7.4 శాతం పెరుగుదలను సూచిస్తుంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగిందని ప్రభుత్వం తెలిపింది.