BrahMos missile: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొనుగోలుకు సంబంధించి భారత్-ఇండోనేషియా మధ్య ప్రధాన రక్షణ ఒప్పందాలు పూర్తవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రష్యా నుంచి తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య వివిధ స్థాయిల్లో చర్చలు జరిగాయి. రష్యా అనుమతి ఇచ్చిన తర్వాత ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఆమోదం పొందితే భారత్ అతిపెద్ద రక్షణ డీల్‌ను పూర్తి చేసినట్లు అవుతుంది.
Read Also: Election Commission: “కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు”.. రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ..
2023 ఏప్రిల్‌లో ఫిలిప్పీన్స్ తో భారత్ 375 మిలియన్ డాలర్ల బ్రహ్మోస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా భారత్ మూడు క్షిపణి బ్యాటరీలను ఫిలిప్పీన్స్ కు అందించింది. 290 కిలోమీటర్ల పరిధి, మాక్ 2.8 వేగం కలిగిన బ్రహ్మోస్ మిస్సైల్ సిస్టమ్‌ను ఫిలిప్పీన్స్ తీర ప్రాంత రక్షణలో మోహరించింది. దీని తర్వాత ఇండోనేషియా భారత్ బ్రహ్మోస్‌లను కొనుగోలు చేయబోతోంది.
భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO), రష్యా యొక్క NPO మాషినోస్ట్రోయెనియా సంయుక్తంగా డెవలప్ చేశాయి. బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులలో ఒకటి. అత్యంత ఖచ్చితత్వంతో, శత్రువుల రాడార్లకు దొరకకుండా దాడులు చేస్తుంది. భూమి, ఆకాశం, సముద్రం నుంచి దీనిని ప్రయోగించవచ్చు. ఈ ఏడాది పాకిస్తాన్‌తో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో, ఒక్కసారిగా ప్రపంచం దృష్టి ఈ క్షిపణిపై పడింది.