NTV Telugu Site icon

Middle East tensions: ఇజ్రాయిల్, ఇరాన్ వెళ్లొద్దని భారతీయులకు కేంద్రం కీలక ఆదేశాలు..

Middle East Tensions

Middle East Tensions

Middle East tensions: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలకు వెళ్లవద్దని కోరింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ రెండు దేశాలకు వెళ్లవద్దని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే 48 గంటల్లో ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమను తాము నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. భద్రత కోసం చాలా జాగ్రత్తలను పాటించాలని, కదలికను కనిష్ట స్థాయికి పరిమితం చేయాలని అభ్యర్థించింది.

Read Also: Viral Video : పానీపూరి లవర్స్ షాక్.. ఇది చూస్తే జన్మలో తినరు..

48 గంటల్లో ఏ క్షణానైనా ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రత్యక్షంగా దాడి చేయవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రత్యక్ష దాడి పరిణామాలు ఎలా ఉంటాయని లెక్కలేసుకుంటోంది. ఇదిలా ఉంటే దాడికి సంబంధించిన అన్ని ప్రణాళికలను సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముందు ఉంచినట్లు అతని సలహాదారు వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న వివరాల ప్రకారం.. 100 కంటే ఎక్కువ డ్రోన్లు, డజన్ల కొద్దీ క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్ సైనిక లక్ష్యాలను ఇరాన్ టార్గెట్ చేయవచ్చని తెలుస్తోంది.

ఇటీవల ఇజ్రాయిల్ సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీ టార్గెట్‌గా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్స్డ్, ఖుద్స్ ఫోర్స్‌కి చెందిన కీలక కమాండర్‌తో పాటు మరో ఆరుగురు కీలక కమాండర్లు మరణించారు. దీంతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్ దాడి చేస్తుందనే అనుమానాల నేపథ్యంలో ఇజ్రాయిల్ కూడా అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే గాజా దక్షిణ సరిహద్దుల్లో ఉన్న బలగాలను ఉపసంహరించుకుంది. బంకర్లు, యాంటీ మిస్సైల్ వ్యవస్థను అప్రమత్తం చేసింది. ఏ దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే ప్రకటించారు.