NTV Telugu Site icon

Bomb Threats: విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది.. విచారణలో షాకింగ్ విషయాలు!

Flit

Flit

గత మూడు రోజులుగా బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. వరుసగా బెదిరింపులు రావడంతో అటు విమాన సంస్థలు, ఇటు పోలీసులు పరుగులు పెట్టారు. ఇలా మూడు రోజులు ప్రయాణికులకు తీవ్ర అవస్థలు ఏర్పడ్డాయి. గడిచిన మూడు రోజుల్లో మొత్తంగా 19 విమానాలు భద్రతా ముప్పును ఎదుర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో గడిచిన 24 గంటల్లోనే 9 విమానాలకు ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. తనిఖీలు తర్వాత ఇవన్నీ కూడా నకిలీవేనని తేలాయి. అయినా కూడా ఈ ఘటనలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముంబై నుంచి బయలుదేరిన విమానాల ఘటనకు సంబంధించి నమోదు చేసిన కేసులో ఓ మైనర్‌ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మెహన్‌ నాయుడు వెల్లడించారు.

ముంబై విమానానికి బాంబు బెదిరింపు చేసిన ఘటనలో ఒక వ్యాపార వేత్త కుమారుడు(17) ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వాటి మూలాలు ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉన్నట్లు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త కుమారుడు సోషల్‌ మీడియాలో ఈ పోస్టులు పెట్టినట్లు కనుగొన్నారు. ఈ కేసులో సదరు వ్యాపారవేత్తకు సమన్లు పంపించిన పోలీసులు.. మైనర్‌ను అదుపులోకి తీసుకుని ముంబై తరలించారు. అయితే డబ్బుల విషయంలో గొడవ పడిన ఓ స్నేహితుడిని ఇరికించేందుకు ఈ బాలుడు ఇదంతా చేసినట్లుగా సమాచారం. స్నేహితుడి పేరుతో ‘ఎక్స్‌’లో ఓ ఖాతా సృష్టించి.. పలు విమానాలకు బెదిరింపు పోస్టులు పెట్టాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.

విమానాల బెదిరింపు ఘటనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. సంబంధిత దర్యాప్తు సంస్థలు ఆయా కేసులపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయని అన్నారు. మూడు విమానాలకు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడిన ఓ మైనర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారన్నారు. విమానయాన సంస్థలు, ప్రయాణికుల రక్షణే లక్ష్యంగా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.